హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పైలట్లకు శిక్షణ ఇస్తున్న ప్రముఖ సంస్థ ఫ్లయిట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (ఎఫ్‌ఎస్‌టీసీ) రెండు ఫ్లయింగ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఒకటి ఉత్తరాదిన, మరొకటి దక్షిణాది రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఏర్పాటు చేయనుంది. వీటి ఏర్పాటుకు మౌలిక వసతులు మెరుగ్గా ఉండి, రద్దీ లేని విమానాశ్రయం తమకు అనువుగా ఉంటుందని ఎఫ్‌ఎస్‌టీసీ సీఈవో దిలావర్ సింగ్ బస్నాన్ శుక్రవారమిక్కడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే బేగంపేట విమానాశ్రయాన్ని ఫ్లయింగ్ స్కూల్‌కు వాడుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. శంషాబాద్‌లో సిమ్యులేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న కంపెనీ.. ఫ్లయింగ్ స్కూల్‌ను సైతం హైదరాబాద్‌లో నెలకొల్పేందుకే మొగ్గు చూపుతోంది.
ఒక్కో కేంద్రానికి రూ.100 కోట్లు..
ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతాయని దిలావర్ సింగ్ పేర్కొన్నారు. ‘‘స్కూల్ ద్వారా పైలట్ శిక్షణ ఇస్తాం. ఇందుకోసం శిక్షణ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. 40 విమానాలను సమకూర్చుకోవాలన్నది ఆలోచన. వచ్చే 10 ఏళ్లలో భారత్‌కు 9– 10 వేల మంది పైలట్లు అవసరం.
గుర్గావ్‌లోని సిమ్యులేషన్ సెంటర్ ద్వారా ఇప్పటికే 600కు పైగా పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చాం. భారత్‌లో ఉన్న పైలట్లలో 40 శాతం మా దగ్గర శిక్షణ తీసుకున్నవారే. శంషాబాద్‌లో రూ.500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిమ్యులేషన్ సెంటర్ ఆగస్టు నాటికి సిద్ధం కానుంది. ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్లకు కోర్సు ఫీజు రూ.15–30 లక్షలు ఉంది’’ అని దిలావర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment