![Andhra Pradesh First Pilot Training Centre to Come Up in Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/30/Pilot_Training.jpg.webp?itok=UVm1a8n6)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఏపీలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు ఎయిరో అడ్వంచర్ స్పోర్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది, ఇది లాభదాయకమా కాదా? వంటి వివరాలతో పూర్తిస్థాయి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తున్నారు.
ఏపీఏడీసీఎల్ పంపిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలించి ఈ నివేదికను తయారు చేసే బాధ్యతను తమకు అప్పగించినట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పవనమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఈ ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. టీఎఫ్‌ఆర్‌ను తయారు చేయడానికి, కన్సల్టెన్సీ ఎంపిక చేయడానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఓర్వకల్లు వద్ద సహజసిద్ధంగా ఉన్న పలు ఆకృతులతో కూడిన కొండలు పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటాయని అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు వీఎన్ భరత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment