సాక్షి, అమరావతి: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో ఆగస్టులో అన్ని జిల్లాల్లో మొత్తం 500 డ్రోన్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. రైతులతోపాటు నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇస్తున్నారు. జిల్లాకు 20 మంది చొప్పున మొత్తం 520 మందికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకు 212 మంది రైతులు, 96 మంది నిరుద్యోగులు డ్రోన్ పైలట్ శిక్షణ పొందేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ మొత్తం 308 మందిలో 203 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆగస్టు కల్లా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఉన్న కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో 500 డ్రోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున మిగతా యూనిట్లకు అవసరమైన వారికి శిక్షణ కోసం ఈ నెల 15వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
కస్టమ్ హైరింగ్ సెంటర్‌కి తప్పనిసరిగా ఒక డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సర్టిఫైడ్ పైలెట్ ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రమైన సెంటర్ ఫర్ అప్సరాకు డ్రోన్ల రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సుకు డీజీసీఏ అనుమతి ఇచ్చిందని తెలిపారు. అక్కడ ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి 12 రోజులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి డీజీసీఏ అనుమతి ఇచ్చిందని, ఇక్కడ పదిరోజుల శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు.
రైతులకు లబ్ధి
వ్యవసాయ కార్యకలాపాల్లో మానవశ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఉత్పత్తి పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచుతోంది. పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలు పిచికారీ చేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రైతుల ఉత్పాదక వ్యయం తగ్గి ఆదాయం పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment