అంచనాలు మించాయ్‌ జీడీపీ వృద్ధి 7% | GDP growth rate plays down note ban worry, 7% growth recorded in Q3 | Sakshi
Sakshi News home page

అంచనాలు మించాయ్‌ జీడీపీ వృద్ధి 7%

Published Wed, Mar 1 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

GDP growth rate plays down note ban worry, 7% growth recorded in Q3

క్యూ3లో కనబడని నోట్ల రద్దు ఎఫెక్ట్‌
తయారీ, వ్యవసాయ రంగాల ఊతం
2016–17లో 7.1 శాతం ఖాయమన్న సీఎస్‌ఓ  


న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మూడవ త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్, క్యూ3)లో అంచనాలను మించింది. ఏడు శాతంగా నమోదయ్యింది. నవంబర్‌ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రకటన... సేవలు, తయారీసహా పలు రంగాలపై ఈ ప్రతికూల ప్రభావం భయాలు... దీనితో వృద్ధి రేటు తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో తాజాగా కేంద్ర గణాంకాల శాఖ మంగళవారం ప్రకటించిన అంచనాలు ఆర్థిక విశ్లేషకులకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. మూడో త్రైమాసికంలో భారత్‌ వృద్ధి రేటు 6.1–6.8 శాతం మధ్య ఉండగలదంటూ పలు ఏజెన్సీలు వేసిన అంచనాల్ని తాజా గణాంకాలు మించడం విశేషం.

ముఖ్య రంగాలను చూస్తే...
అక్టోబర్‌– డిసెంబర్‌మధ్య కాలంలో తయారీ రంగం 8.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలోని 6.9 శాతం కన్నా ఇది అధిక వృద్ధి కావడం గమనార్హం.  అయితే 2015 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 12.8 శాతం. మొత్తం ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం వృద్ధి 10.6 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గుతుందన్నది సీఎస్‌ఓ అంచనా. ఇక వ్యవసాయ రంగం (అటవీ, మత్స్య సంపదసహా) వృద్ధి మూడవ త్రైమాసికంలో 6 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –2.2 శాతం క్షీణత నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ వృద్ధి 0.8 శాతం నుంచి 4.4 శాతానికి పెరుగుతుందన్నది అంచనా.  కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌కాలంలో వ్యవసాయ రంగం వృద్ధి 3.8 శాతం.  

ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనా 7.1 శాతం
తాజా గణాంకాల నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్‌–మార్చి)లో వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందన్న జనవరి మొదటి అడ్వాన్స్‌ అంచనాలను అదే విధంగా కొనసాగిస్తున్నట్లు సీఎస్‌ఓ పేర్కొంది. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...
మొత్తం ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.113.58 లక్షల కోట్ల నుంచి రూ.121.65 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనాల్లో ఎటువంటి మార్పు చేయడం లేదని సీఎస్‌ఓ పేర్కొంది. కాగా స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వాస్తవిక జీడీపీ రేటు మాత్రం 7.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గుతున్నట్లు సీఎస్‌ఓ తెలిపింది. విలువ రూపంలో ఇది రూ.104.70 లక్షల కోట్ల నుంచి రూ.111.68 కోట్లకు పెరుగుతుందన్నది అంచనా.
కరెంట్‌ ప్రైస్‌ వద్ద తలసరి ఆదాయం 10.2 శాతం పెరుగుదలతో రూ.94,178 నుంచి రూ.1,03,818 చేరుతుందని అంచనావేసింది.
ప్రైవేటు వినియోగ వ్యయం రూ.79 లక్షల కోట్ల నుంచి రూ.88.40 లక్షల కోట్లకు చేరుతుందని సీఎస్‌ఓ అంచనావేస్తోంది.
పెట్టుబడులకు సంబంధించి గ్రాస్‌ ఫిక్స్‌డ్‌  క్యాపిటల్‌ ఫార్మేషన్‌ విలువ రూ.39.89 లక్షల కోట్ల నుంచి రూ.40.97 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.  
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల (జూన్, సెప్టెంబర్‌ నెలలతో ముగిసిన మూడు నెలల కాలాలు) జీడీపీ గణాంకాలను ఎగువ దిశగా సీఎస్‌ఓ సవరించింది. వీటిని వరుసగా 7.2 శాతం, 7.4 శాతాలకు పెంచింది. 2014–15లో భారత్‌ జీడీపీ వృద్ధి 7.2 శాతంకాగా, 2015–16లో ఈ రేటు 7.9 శాతంగా ఉంది.

గణాంకాల ప్రకారమే ముందుకు: కేంద్రం
ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం అధిక బేస్‌తో ఉన్న గణాంకాలు ఇవని, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అద్దం పడుతున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్‌దాస్‌ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత తగ్గిందనడంలో వాస్తవం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. గణాంకాల ప్రాతిపదికనే కేంద్రం నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement