2023 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి రేటును మాత్రమే సాధించగలిగింది. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ జీడీపీ పతనం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమితమైంది.
ఈ దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉండడం. ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ప్రభుత్వ విధానాలు మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలానికి సంబం ధించి డిసెంబర్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి (జీడీపీ) రేటును మాత్రమే సాధించగలిగింది. అంతకు ముందరి త్రైమాసిక వృద్ధి రేటు 6.3 శాతం కంటే ఇది గణనీయమైన పతనం. 2022 ఆర్థిక సంవత్సరం తాలూకూ మూడవ త్రైమాసికంలోని 5.2 శాతం కంటే కూడా ఇది తక్కువ. ఈ జీడీపీ దిగజారుడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న అనేక సమస్యలకు ప్రతిబింబం.
వృద్ధి రేటును లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే అంశా లుగా వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ వినియోగం లేదా వ్యయాలు, పెట్టుబడులు, నికర ఎగుమతులు ఉంటాయి. వీటిలో వ్యక్తిగత విని యోగానిది అతిపెద్ద వాటా. అది దేశీయ జీడీపీలో 55 నుంచి 60 శాతం మేరకు వాటాని కలిగి ఉంటుంది. కాగా, ఇది ప్రస్తుతం అంతకు ముందరి మూడవ త్రైమాసికంలోని వృద్ధి రేటుతో పోలిస్తే కేవలం 2.1 శాతం మాత్రమే ఎదుగుదలను చూపింది.
ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు పతనం వెనుక వ్యక్తిగత వినియోగ పతనం ఉందన్నది గమనించాల్సిన అంశం. ఈ వ్యక్తిగత వినియోగం తగ్గటం వెనుక అసమానతలతో కూడిన ఆర్థిక అభివృద్ధి ఉంది. దీనినే మనం ఆంగ్లాక్షరం ‘కే’ పై గీత, కింది గీతలతో పోలుస్తున్నాం. పై గీతను పోలిన ధనవంతులు మరింతగా ధనవంతులవుతుండగా, కింది గీతను పోలిన సామాన్య జనం మరింత కిందికి దిగజారుతున్నారు.
ఈ అసమానతల అభివృద్ధికి వక్కాణింపుగా – ఇండియా రేటింగ్స్ సంస్థ ఆర్థిక వేత్త సునీల్ కుమార్ సిన్హా మాటలను చెప్పుకోవచ్చు: ‘ప్రస్తుత వినియోగ డిమాండ్ అనేది ప్రధానంగా ఉన్నత ఆర్థిక వర్గాలు వినియోగించే సరుకులు, సేవల నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం దేశంలోని ప్రజల వ్యక్తిగత వినియోగంలో సింహభాగం – ఉన్నత ఆదాయ వర్గాల నుంచే వస్తోంది. మరో రకంగా చెప్పాలంటే – మెజారిటీ జన సామాన్యం కొనుగోళ్లు బల హీనంగా ఉన్నాయి.›ఫలితంగా అంతిమ లెక్కింపులో దేశంలో వ్యక్తిగత వినియోగం బలహీనపడుతోంది’.
కోవిడ్ మహమ్మారి కాలంలో దేశంలో ప్రజల వినియోగం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తొలి దశలో ఈ వ్యక్తిగత వినియోగం పెద్దగంతులో పెరిగింది. కోవిడ్, లాక్ డౌన్ల కాలంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు లేదా సేవల కొను గోళ్లను వాయిదా వేసి ఉంచడం... కోవిడ్ బెడద తగ్గగానే ఒక్కసారిగా కొనుగోళ్లు చేయడం ఈ పెద్దగంతు వినియోగ పెరుగుదలకు కారణం. ఒక మారు ఈ తరహా కొనుగోళ్లు పూర్తయి పోగానే, మరలా వినియోగం తగ్గుముఖం పట్టసాగింది.
కోవిడ్ అనంతర కాలంలో కూడా జఠిలంగానే మిగిలి పోయిన నిరుద్యోగం, పడిపోతున్న దేశీయ ఎగుమతులు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలన్నీ కల గలిసి ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. కోవిడ్, లాక్‌డౌన్లు, అనంతరం కూడా సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యారు. బంగారాన్ని తనఖా పెట్టడం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల పొదుపు స్థాయి దారుణంగా పడి పోయింది. కొత్తగా అప్పులు చేయగల స్థితి కూడా లేకుండా పోయింది.
జీడీపీ పతనం కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమి తమైంది. అంటే, భారతదేశంలో జీడీపి వృద్ధి, మిగత ప్రపంచం తాలూకూ సమస్యలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోనే అత్యధి కంగా ఉంటుందనే కట్టుకథను ఇది వట్టిదిగా కొట్టేసింది. పైన పేర్కొన్న దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆయా దేశాలలో ఆర్థిక అసమానతలు అత్యంత తీవ్రస్థాయిలో ఉండడం.
భారత్ సహా దరిదాపు ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ఉదాహరణకు, అంత ర్జాతీయ కార్మిక సమాఖ్య గణాంకాల ప్రకారం 2008–11 కాలంలో మన దేశంలో నిజ వేతనాల పెరుగుదల 1 శాతం ప్రతికూల దిశగా ఉన్నది. అదే కాలంలో దేశంలో కార్మిక ఉత్పాదకత 7.6 శాతం పెరిగింది.
పెరిగిన సంపద తాలూకు ప్రయోజనం కార్మికులు, ఉద్యోగు లకు దక్కక పోగా, వారికి అప్పటికే ఉన్న ఆర్థిక స్థితి దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది ఈ వేతనాల పతనమే. 2018 నాటి అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తాలూకు ప్రపంచ వేతనాల నివేదిక కూడా ఈ అంశాన్నే చెబుతోంది.
ఒక్క చైనా మినహా 2017లో ప్రపంచ వ్యాప్తంగా వేతనాల పెరుగుదల వార్షికంగా కేవలం 1.1 శాతం. జపాన్‌లో దశాబ్దాల కాలంపాటు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు ఎదుగూ బొదుగూ లేకుండా స్తంభించిపోయి ఉన్నాయి. మొత్తంగా జీ 20 దేశాల్లో 2017లో నిజ వేతనాల వృద్ధి కేవలం 0.4 శాతం. చైనాలో 2015 నాటికే సరుకు ఉత్పత్తి రంగంలోని కార్మికుల 1 గంట కాలపు వేతనాలు, అప్పటికే అధిక ఆదాయ దేశాలుగా ఉన్న గ్రీస్, పోర్చుగల్‌తో సమానంగా ఉన్నాయి. దాని వలన అక్కడ యావన్మంది ప్రజల కొనుగోలు శక్తి తగినస్థాయిలో ఉంది.
ఫలితంగానే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం తన దేశీయ ఎగుమతులు కొంత మేర తగ్గినా, స్వయంగా తన దేశంలోనే పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి ద్వారా, ఆర్థిక వృద్ధిని కొనసాగించగలిగింది. ప్రస్తుతం తన జీరో కోవిడ్ పాలసీ, నిర్మాణ రంగం పట్ల కఠిన వైఖరి తరువాత కూడా చైనాలో కర్మాగారాల ఉత్పత్తి రికార్డు స్థాయిని అందుకుంది. దీనంతటికీ కారణం, కొనుగోలు శక్తి ప్రజానీకం అంతటిలోనూ విస్తారంగా పెరిగి ఉండడమే.
మన దేశంలో నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాలు పొదుపు చర్యల రూపంలో ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పొదుపు చర్యల వల్ల ప్రతీ సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలపై కోతలు పడుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ విధానాలపై కోతలు పడడం చూశాం. ఈ పొదుపు చర్యలలో భాగంగానే దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గిపోయింది.
2022లోనే దీనిలో 8.8 శాతం తగ్గుదల నమోదైంది. దీనంతటి ఫలితంగా ప్రజల ఉపాధి అవకాశాలు, కొనుగోలు శక్తి వేగంగా పడిపోతున్నాయి. దశాబ్దాల కాలం ప్రజల పన్నుల డబ్బు, శ్రమలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు వేగంగా ప్రైవేటు పరం అవుతుండడం... దేశంలోని రోడ్లు, రైలు మార్గాలు, స్టేడియాలు ఇత్యాది సమస్త మౌలిక సదు పాయాల వ్యవస్థలూ నగదీకరణ పేరిట ప్రైవేట్ పరం అవుతుండడంతో – ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే పేరిట (ద్రవ్యలోటు తగ్గింపు కోసం) నిత్యావసరాల పైన కూడా జీఎస్టీ వంటి పన్ను భారాలను మోపడం ప్రజల కొనుగోలు శక్తి పాలిట అశనిపాతంగా మారుతోంది.
ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్న విధంగా, మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్గం – ఇప్పటి వరకూ జరిగినట్లుగా కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు ఇస్తూ పోయి, జన సామాన్యంపై భారాలు మోపుతూ నిర్ణయాలు తీసు కోవడం కాదు. సంపదలో సాధ్యమైనంతగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి జనాలకు తగిన వాటాను కల్పించడం! ప్రస్తుత వృద్ధి రేటు పతనం, దానికి మూలంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి పతనం వంటి వాటిని పరిష్కరించలేని పక్షంలో మున్ముందు దేశ ఆర్థిక సమస్యలు మరింత జఠిలం కాగలవు.
డి. పాపారావు
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
మొబైల్: 98661 79615
Comments
Please login to add a commentAdd a comment