హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడం బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) ఇండియా... ఏటా ఒక కొత్త రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఒక్కో కేంద్రానికి రూ.250 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి కృష్ణపట్నం, కాకినాడ వద్ద ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం నెలకు 1,500 టన్నులు. కాకినాడ వద్ద మరో యూనిట్‌ను నెలకు 1,100 టన్నుల కెపాసిటీతో రూ.240 కోట్లతో నెలకొల్పుతోంది. 2019లో ఇది ఉత్పత్తి ఆరంభిస్తుందని జీఈఎఫ్ ఎండీ ప్రదీప్ చౌదరి బుధవారం వెల్లడించారు. నూతన ప్యాకింగ్‌లో నూనెలను విడుదల చేసిన సందర్భంగా సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
నూతన మార్కెట్లలో పాగా..
కంపెనీ ప్రస్తుతం సన్‌ఫ్లవర్ నూనె అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కర్ణాటకలో 4 శాతం వాటాతో పోటీపడుతోంది. చత్తీస్‌గఢ్, తమిళనాడులోనూ పాగా వేయాలన్నది ఆలోచన అని ప్రదీప్ చౌదరి తెలిపారు. ‘తమిళనాడుతో మొదలుపెట్టి తూర్పు భారత్‌లో విస్తరిస్తాం. మూడేళ్లలో తమిళనాడు, ఒరిస్సాలో రిఫైనరీలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, బిహార్‌లో అడుగుపెడతాం. ప్రస్తుతమున్న ప్లాంట్ల వినియోగం 100 శాతానికి చేరింది. విక్రయాలు అధికం కావడంతో ఇతర రిఫైనరీల నుంచి నూనెలు కొనుగోలు చేస్తున్నాం. 2017–18లో రూ.4,000 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ఈ ఏడాది రూ.5,000 కోట్లు ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. ఫ్రీడం బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, ఆవ, వేరుశనగ, నువ్వుల నూనెను కంపెనీ మార్కెట్ చేస్తోంది. కంపెనీ తాజాగా పెట్ బాటిళ్లలో వీటిని విడుదల చేసింది. సినీ నటి రెజీనా చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించింది. పౌచ్‌తో పోలిస్తే పెట్ బాటిల్ ధర రూ.2 అధికం. భారత్‌లో మాత్రమే కంపెనీలు పౌచ్‌లలో నూనెలను విక్రయిస్తున్నాయని జీఈఎఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి తెలిపారు.
తూర్పున ఏటా ఒక రిఫైనరీ
Published Thu, Aug 30 2018 1:30 AM | Last Updated on Thu, Aug 30 2018 1:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment