Gemini edibles
-
ఐపీవోకు జెమినీ వంట నూనెలు
హైదరాబాద్: వంట నూనెల తయారీ సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతిని కోరుతూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్లతోపాటు.. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు సైతం వాటాలను విక్రయానికి ఉంచనున్నట్లు జెమినీ ఎడిబుల్స్ తెలియజేసింది. ప్రదీప్ చౌధరి రూ. 25 కోట్లు, అల్కా చౌధరి రూ. 225 కోట్లు, గోల్డెన్ ఆగ్రి ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ రూ. 750 కోట్లు, బ్లాక్ రివర్ ఫుడ్ 2పీటీఈ రూ. 1,250 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ పీటీఈ రూ. 250 కోట్లు చొప్పున ఈక్విటీని ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. వాటాల వివరాలిలా ప్రస్తుతం జెమినీ ఎడిబుల్స్లో గోల్డెన్ అగ్రికి 56.27 శాతం, అల్కా చౌధరికి 11.56 శాతం, బ్లాక్ రివర్ ఫుడ్‌కు 25 శాతం, ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్‌కు 6.6 శాతం, ప్రదీప్‌కు 0.57 శాతం చొప్పున వాటా ఉంది. ఫ్రీడమ్ బ్రాండ్‌తో జెమినీ ఎడిబుల్స్ వంట నూనెలు విక్రయించే సంగతి తెలిసిందే. వంట నూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, పంపిణీ, బ్రాండింగ్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈక్విటీ షేర్లను లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఇటీవలే ఫార్చూన్, ఆధార్ బ్రాండ్ వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్ సైతం సెబీకి ఐపీఓ కోసం దరఖాస్తు చేయడం గమనార్హం! -
తూర్పున ఏటా ఒక రిఫైనరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడం బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) ఇండియా... ఏటా ఒక కొత్త రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఒక్కో కేంద్రానికి రూ.250 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి కృష్ణపట్నం, కాకినాడ వద్ద ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం నెలకు 1,500 టన్నులు. కాకినాడ వద్ద మరో యూనిట్‌ను నెలకు 1,100 టన్నుల కెపాసిటీతో రూ.240 కోట్లతో నెలకొల్పుతోంది. 2019లో ఇది ఉత్పత్తి ఆరంభిస్తుందని జీఈఎఫ్ ఎండీ ప్రదీప్ చౌదరి బుధవారం వెల్లడించారు. నూతన ప్యాకింగ్‌లో నూనెలను విడుదల చేసిన సందర్భంగా సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. నూతన మార్కెట్లలో పాగా.. కంపెనీ ప్రస్తుతం సన్‌ఫ్లవర్ నూనె అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కర్ణాటకలో 4 శాతం వాటాతో పోటీపడుతోంది. చత్తీస్‌గఢ్, తమిళనాడులోనూ పాగా వేయాలన్నది ఆలోచన అని ప్రదీప్ చౌదరి తెలిపారు. ‘తమిళనాడుతో మొదలుపెట్టి తూర్పు భారత్‌లో విస్తరిస్తాం. మూడేళ్లలో తమిళనాడు, ఒరిస్సాలో రిఫైనరీలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, బిహార్‌లో అడుగుపెడతాం. ప్రస్తుతమున్న ప్లాంట్ల వినియోగం 100 శాతానికి చేరింది. విక్రయాలు అధికం కావడంతో ఇతర రిఫైనరీల నుంచి నూనెలు కొనుగోలు చేస్తున్నాం. 2017–18లో రూ.4,000 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ఈ ఏడాది రూ.5,000 కోట్లు ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. ఫ్రీడం బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, ఆవ, వేరుశనగ, నువ్వుల నూనెను కంపెనీ మార్కెట్ చేస్తోంది. కంపెనీ తాజాగా పెట్ బాటిళ్లలో వీటిని విడుదల చేసింది. సినీ నటి రెజీనా చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించింది. పౌచ్‌తో పోలిస్తే పెట్ బాటిల్ ధర రూ.2 అధికం. భారత్‌లో మాత్రమే కంపెనీలు పౌచ్‌లలో నూనెలను విక్రయిస్తున్నాయని జీఈఎఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి తెలిపారు. -
తెలంగాణలో జెమిని ఎడిబుల్స్ రిఫైనరీ
తొలి దశలో 100 కోట్ల పెట్టుబడి ⇒ డిసెంబరుకి ఉత్పత్తి ప్రారంభం ⇒ కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడమ్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) తెలంగాణలో రిఫైనరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 30 ఎకరాల స్థలం కావాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అనుమతులు రాగానే 9 నెలల్లో ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే తీపి కబురు వస్తుందని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విద్యుత్ సరఫరా సమస్యలు లేకపోవడం, మార్కెట్ అవకాశాల దృష్ట్యా ప్లాంటును ఇక్కడ నెలకొల్పుతున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో ఇది రానుందని పేర్కొన్నారు. తొలి దశలో రూ.100 కోట్ల పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే 600 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. మార్కెట్‌కు దగ్గరగా.. ప్రస్తుతం జెఫ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. విదేశాల నుంచి ముడి నూనెలు దిగుమతి చేసుకుని శుద్ధి చేయడానికి వీలుగా వీటిని తీర ప్రాంతంలో నెలకొల్పింది. అయితే కంపెనీకి మార్కెట్ పరంగా తెలంగాణలో ప్లాంటు అనువైనదని భావిస్తోంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనె అమ్మకాల్లో ఫ్రీడమ్ బ్రాండ్ తెలంగాణలో 35 శాతం వాటాతో టాప్–1గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం, ఒరిస్సాలో 50 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్త ప్లాంటులో సన్‌ఫ్లవర్‌తోపాటు ఇతర నూనెల శుద్ధి, ప్యాకింగ్ చేస్తారు. ఇక రైస్ బ్రాన్ ఆయిల్ అమ్మకాలు ఈ రాష్ట్రాల్లో వేగం పుంజుకుంటున్నాయి. అలాగే తెలంగాణలో ముడి సరుకు లభ్యత ఎక్కువే. అందుకే రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు ప్రదీప్ చౌదరి వెల్లడించారు. ఆరోగ్య కారణాలరీత్యా రైస్ బ్రాన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం భవిష్యత్తులో గణనీయంగా ఉంటుందని అన్నారు. లక్ష్యం 20 శాతం వృద్ధి..: జెమిని ఎడిబుల్స్ 2016–17లో రూ.3,500 కోట్ల టర్నోవర్ అంచనా వేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ విక్రయాల్లో దేశంలో నంబర్–2 స్థానంలో నిలిచామని జెఫ్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. మార్కెట్లో కొన్ని నెలల వరకు వంట నూనెల ధరలు స్థిరంగా ఉంటాయని వివరించారు. కస్టమర్లు బ్రాండెడ్ ఆయిల్స్ వైపుకు మళ్లుతున్నారని చెప్పారు.