తెలంగాణలో జెమిని ఎడిబుల్స్‌ రిఫైనరీ | Gemini Edibles & Fats India Private Limited launches 2-liter SKU | Sakshi
Sakshi News home page

తెలంగాణలో జెమిని ఎడిబుల్స్‌ రిఫైనరీ

Published Fri, Mar 17 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

తెలంగాణలో జెమిని ఎడిబుల్స్‌ రిఫైనరీ

తెలంగాణలో జెమిని ఎడిబుల్స్‌ రిఫైనరీ

తొలి దశలో 100 కోట్ల పెట్టుబడి
డిసెంబరుకి ఉత్పత్తి ప్రారంభం
కంపెనీ ఎండీ ప్రదీప్‌ చౌదరి 
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫ్రీడమ్‌ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్‌ ఇండియా (జెఫ్‌) తెలంగాణలో రిఫైనరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 30 ఎకరాల స్థలం కావాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అనుమతులు రాగానే 9 నెలల్లో ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు జెమిని ఎడిబుల్స్‌ ఎండీ ప్రదీప్‌ చౌదరి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే తీపి కబురు వస్తుందని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విద్యుత్‌ సరఫరా సమస్యలు లేకపోవడం, మార్కెట్‌ అవకాశాల దృష్ట్యా ప్లాంటును ఇక్కడ నెలకొల్పుతున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌ సమీపంలో నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో ఇది రానుందని పేర్కొన్నారు. తొలి దశలో రూ.100 కోట్ల పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే 600 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.

మార్కెట్‌కు దగ్గరగా..
ప్రస్తుతం జెఫ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. విదేశాల నుంచి ముడి నూనెలు దిగుమతి చేసుకుని శుద్ధి చేయడానికి వీలుగా వీటిని తీర ప్రాంతంలో నెలకొల్పింది. అయితే కంపెనీకి మార్కెట్‌ పరంగా తెలంగాణలో ప్లాంటు అనువైనదని భావిస్తోంది. ప్యాకేజ్డ్‌ సన్‌ఫ్లవర్‌ నూనె అమ్మకాల్లో ఫ్రీడమ్‌ బ్రాండ్‌ తెలంగాణలో 35 శాతం వాటాతో టాప్‌–1గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం, ఒరిస్సాలో 50 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్త ప్లాంటులో సన్‌ఫ్లవర్‌తోపాటు ఇతర నూనెల శుద్ధి, ప్యాకింగ్‌ చేస్తారు. ఇక రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ అమ్మకాలు ఈ రాష్ట్రాల్లో వేగం పుంజుకుంటున్నాయి. అలాగే తెలంగాణలో ముడి సరుకు లభ్యత ఎక్కువే. అందుకే రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు ప్రదీప్‌ చౌదరి వెల్లడించారు. ఆరోగ్య కారణాలరీత్యా రైస్‌ బ్రాన్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వినియోగం భవిష్యత్తులో గణనీయంగా ఉంటుందని అన్నారు.

లక్ష్యం 20 శాతం వృద్ధి..: జెమిని ఎడిబుల్స్‌ 2016–17లో రూ.3,500 కోట్ల టర్నోవర్‌ అంచనా వేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. ప్యాకేజ్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ విక్రయాల్లో దేశంలో నంబర్‌–2 స్థానంలో నిలిచామని జెఫ్‌ సేల్స్, మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.చంద్రశేఖర రెడ్డి తెలిపారు.  మార్కెట్లో కొన్ని నెలల వరకు వంట నూనెల ధరలు స్థిరంగా ఉంటాయని వివరించారు. కస్టమర్లు బ్రాండెడ్‌ ఆయిల్స్‌ వైపుకు మళ్లుతున్నారని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement