న్యూఢిల్లీ: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీ ఇన్సూరెన్స్ (జీఐసీ రీ) ఐపీఓ 1.37 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.855–912 ధరల శ్రేణితో ఈ నెల 11న ప్రారంభమైన ఈ ఐపీఓ ద్వారా జీఐసీ రూ.11,370 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓలో భాగంగా 12.47 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఐపీఓ చివరి రోజైన శుక్రవారం నాటికి మొత్తం 17.06 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి.
సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 2.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 0.22 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 0.48 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్, డాయిష్ ఇండియా, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, కోటక్ క్యాపిటల్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 25న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.
కోల్ ఇండియా ఐపీఓ(రూ.15,200 కోట్లు),రిలయన్స్ పవర్ ఐపీఓ(రూ.11,700 కోట్ల) తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఐపీఓ నిధులను వ్యాపార వృద్ధికి, ప్రస్తుత సాల్వెన్సీ స్థాయిలను కొనసాగించడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. 2015–17 కాలానికి కంపెనీ స్థూల ప్రీమియమ్ 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment