అదానీ చేతికి జీఎంఆర్ విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ రుణభారాలను తగ్గించుకునే దిశగా వివిధ అసెట్స్‌ను విక్రయిస్తోంది. గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్) తాజాగా రెండు విద్యుత్ పంపిణీ ప్రాజెక్టుల్లో వాటాలను అదానీ ట్రాన్స్‌మిషన్‌కు (ఏటీఎల్) విక్రయిస్తోంది. మరు ట్రాన్స్‌మిషన్ సర్వీసెస్ (ఎంటీఎస్‌ఎల్), అరావళి ట్రాన్స్‌మిషన్ సర్వీసెస్ (ఏటీఎస్‌ఎల్)లో వాటాల విక్రయానికి ఏటీఎల్‌తో జీఈఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 100 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ పేర్కొంది. అదనంగా మిగతా వాటాలను కూడా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రస్తుతానికి ఎంటీఎస్‌ఎల్‌లో 74 శాతం, ఏటీఎస్‌ఎల్‌లో 49 శాతం వాటాలను ఏటీఎల్‌కి బదలాయించనున్నట్లు తెలిపింది.
ఈ అసెట్స్‌కు సంబంధించి ఏపీటీఈఎల్ ముందున్న వివిధ అప్పీళ్ల ద్వారా రావాల్సిన రూ. 120 కోట్లు కూడా వస్తే జీఈఎల్‌కు మొత్తం రూ. 220 కోట్లు లభించగలవని జీఎంఆర్ పేర్కొంది. 2010లో బిల్డ్, ఓన్, ఆపరేట్, మెయింటెయిన్ (బూమ్) ప్రాతిపదికన జీఎంఆర్ ఎనర్జీ ఈ రెండు ప్రాజెక్టులను దక్కించుకుంది. రాజస్తాన్‌లో ఎంటీఎస్‌ఎల్ 270 కి.మీ. మేర, ఏటీఎస్‌ఎల్ 96 కి.మీ. మేర పంపిణీ లైన్లను నిర్వహిస్తున్నాయి. మార్చి ఆఖరు నాటికి ఈ రెండు ప్రాజెక్టుల రుణం రూ. 324 కోట్ల మేర ఉంది. విక్రయ లావాదేవీ పూర్తయ్యాక...జీఎంఆర్ గ్రూప్ కన్సాలిడేటెడ్ రుణం తగ్గనుంది. ఈ డీల్‌తో ఆర్థికంగా కంపెనీ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడగలదని జీఎంఆర్ గ్రూప్ విద్యుత్ విభాగం బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు.