వాటాల విక్రయాలపై జీఎంఆర్ కసరత్తు
• చత్తీస్‌గఢ్ విద్యుత్ ప్లాంటుపై చర్చలు
• హైదరాబాద్ ఎయిర్‌పోర్టుపై సీడీపీక్యూ ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారీ రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టిన మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ మరికొన్ని వ్యాపారాల్లో వాటాలను విక్రయించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో బాగంగా జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్) అనుబంధ సంస్థ జీఎంర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీలో (జీసీఈఎల్) వాటాల విక్రయంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్‌తో పాటు అమెరికాకు చెందిన లోన్ స్టార్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
జీసీఈఎల్‌కు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మొత్తం 1,370 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రెండు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. సంస్థకు దాదాపు రూ. 8,290 కోట్ల రుణభారం ఉంది. దీన్ని 2017 నుంచి తిరిగి చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ. 750 కోట్ల విలువ చేసే రెండు క్యాప్టివ్ గనులు కూడా ఉన్న జీసీఈఎల్ విలువ సుమారు రూ. 12,500 కోట్ల మేర ఉండొచ్చని అంచనా.
అయితే, జీసీఈఎల్‌కు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లేకపోవడం డీల్‌కు అడ్డంకిగా మారొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం స్వల్పకాలిక పీపీఏలే ఉన్న జీసీఈఎల్.. తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదరవచ్చని భావిస్తోంది. సెంబ్‌కార్ప్, లోన్ స్టార్ ఫండ్స్.. రెండూ కూడా ఇటీవల సన్‌ఎడిసన్‌కి చెందిన భారత వ్యాపార విభాగం కొనుగోలు కోసం షార్ట్‌లిస్ట్ అయిన సంస్థలే. అయితే, దీన్ని అంతిమంగా హైదరాబాద్‌కి చెందిన గ్రీన్‌కో ఎనర్జీ కొనుగోలు చేసింది.
విమానాశ్రయంలో 30 శాతం వాటాలు..
జీఎంఆర్‌కి చెందిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులో వాటాలు తీసుకోవడంపై కెనడా ఫండ్ సంస్థ సీడీపీక్యూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 25-30 శాతం వాటా కొనుగోలు చేయాలని సీడీపీక్యూ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 350-400 మిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. సీడీపీక్యూ సంస్థ.. టీవీఎస్ గ్రూప్‌లో భాగమైన టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌లో దాదాపు రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అటు అబూ ధాబి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.
విద్యుత్, విమానాశ్రయాలు తదితర రంగాల్లో విస్తరించిన జీఎంఆర్ గ్రూప్ రుణభారం దాదాపు రూ. 43,000 కోట్ల మేర ఉంది. దీన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా కొన్నాళ్ల క్రితమే జీఎంఆర్ ఎనర్జీ సంస్థలో 30 శాతం వాటాను దాదాపు 300 మిలియన్ డాలర్లకు మలేషియా సంస్థ టెనగా నేషనల్ బెర్హాద్‌కి విక్రయించింది. ఆ తర్వాత మారు ట్రాన్స్‌మిషన్ సర్వీసెస్‌లో 74 శాతం, అరావళి ట్రాన్స్‌మిషన్ సర్వీసెస్‌లో 49 శాతం వాటాలను అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించింది.