వెండి వెలుగులు..
♦ మళ్లీ రూ.45 వేలపైకి
♦ రెండేళ్ల గరిష్ట స్థాయి పసిడిదీ అప్‌ట్రెండే
ముంబై: వెండి ధర ఇక్కడ ప్రధాన స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం భారీగా పెరిగింది. కేజీకి రూ. 1,520 లాభపడి రూ. 45,080 వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. పరిశ్రమలు పుంజుకుంటాయని, దీనితో యంత్ర పరికరాల్లో వినియోగానికి సంబంధించి ఈ మెటల్ డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలు వెండి పరుగుకు కారణం. కాగా పసిడి 99.9, 99.5 స్వచ్ఛత ధర కూడా రూ.185 చొప్పున లాభపడ్డాయి. ఈ ధరలు వరుసగా, రూ. 30,895, రూ.30,745 వద్ద ముగిశాయి.
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, దేశీయంగా ఇన్వెస్టర్ల డిమాండ్ వంటి అంశాలు పసిడి పటిష్టతకు కారణం. కాగా శుక్రవారం కడపటి సమాచారం అందే సరికి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ఔన్స్(31.1గ్రా) ధర 19 డాలర్ల లాభంతో 1,339 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 19 డాలర్ల పైన లాభంలో ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్‌లో పసిడి రూ. 300 లాభంతో రూ.31,497 వద్ద ట్రేడవుతుండగా, వెండి కేజీకి భారీగా రూ.1,844 లాభంతో రూ. 45,311 వద్ద ట్రేడవుతోంది.