సాక్షి, న్యూఢిల్లీ : విశ్లేషకులు ఊహించినట్టుగానే బంగారం డిమాండ్ అంతకంతకూ క్షీణిస్తోంది. భారతదేశంలో పుత్తడి వినియోగంపై డబ్యూజీసీ(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) తాజా నివేదికను మంగళవారం విడుదల చేసింది. బంగారం వినియోగంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఇండియాలో తాజాగా బంగారం డిమాండ్ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గడం వంటి పలు అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. దేశంలో అత్యంత పవిత్రమైన రోజు ధంతెరాస్‌పై అమ్మకాలు కూడా గత నెలలో పడిపోయాయి, ఇది బలహీనమైన డిమాండ్‌ను మరింత సూచిస్తుందని తెలిపింది.
పసిడి ధర కొత్త గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పీఆర్ తెలిపారు. ఇటీవల కాలంలో కురిసిన అధిక వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేశారు. అలాగే ఈ ఏడాది బంగారం డిమాండ్ గతేడాదితో పోల్చుకుంటే 8 శాతం పడిపోయి 700 టన్నులకు చేరుకుందని, ఇది 2016 తర్వాత కనిష్ఠ స్థాయి అని డబ్యూజీసీ ఇండియా ఆపరేషన్ మేనేజింగ్ డైరక్టర్ సోమసుందరమ్ పీఆర్ అన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం వినియోగం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే భారీగా తగ్గి 123.9 టన్నులుగా నమోదైంది. ఇండియా మార్కెట్‌లో బంగారం ధరలు 2019లో అంతర్జాతీయంగా ఉన్న ధర కంటే 17 శాతం పెరిగాయి. డిమాండ్ మందగించడంతో బంగారం దిగుమతులు తగ్గాయని, ఇది ద్రవ్యలోటును తగ్గించి రూపీ బలపడడంలో సహాయపడిందని విశ్లేషకులు తెలిపారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో బంగారానికి డిమాండ్ మూడొంతులలో రెండొంతులు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంది. గత 25 ఏళ్ల కాలంలో జూన్-సెప్టెంబర్ సీజన్‌లో వానలు అధికంగా పడ్డాయి. ఇది అక్టోబర్‌లోనూ కొనసాగింది. ఫలితంగా సిద్ధంగా ఉన్న వేసవి కాల పంటలయిన పత్తి, సోయాబీన్, చిరుధాన్యలు నాశనమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర జీవితకాల గరిష్ఠమైన రూ. 39,885 స్థాయికి చేరుకుంది. మొత్తంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించడంతో ఈ ఏడాదిలో బంగారం ధరలు 22 శాతం మేర పెరిగాయి. దేశీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో బంగారం డిమాండ్ జులై-సెప్టెంబర్‌లో తగ్గిందని డబ్యూజీసీ పేర్కొంది. ఈ ఏడాది జులై మొదటి వారంలో ఇండియా బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
జూలై-సెప్టెంబర్ కాలంలో123.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా. అంతకుముందు సంవత్సరం కంటే 32 శాతం క్షీణించింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో వినియోగం 5.3 శాతం తగ్గి 496 టన్నులకు చేరుకుంది. జూలై-సెప్టెంబర్ కాలంలో నికర దిగుమతులు 66 శాతం క్షీణించి 80.5 టన్నులకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment