సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం, ఆకాశాన్నంటిన ధరలతో పసిడికి డిమాండ్ భారీగా పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020 సంవత్సరంలో దేశీయంగా పుత్తడి డిమాండ్ 25 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2020 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 25 సంవత్సరాల కనిష్టానికి చేరింది. (అన్ని ఆభరణాలకూ హాల్‌మార్క్ అమలయ్యేనా?)
2019లో 690.4 టన్నులతో పోలిస్తే ఇది 446 టన్నులకు పడిపోయింది. 1995లో 462 టన్నుల వద్ద డిమాండ్ చివరిసారిగా పెరిగిందని డబ్ల్యుజీసీ ఇండియా పీఆర్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం వెల్లడించారు. డబ్ల్యుజీసీ డేటా ప్రకారం మొత్తం ఆభరణాల డిమాండ్ 2019 లో 544.6 టన్నులతో పోలిస్తే భారతదేశంలో (సమీక్షించిన కాలంలో) 42 శాతం పడి 315.9 టన్నులుగా ఉంది. 2020 లో ఆభరణాల డిమాండ్ 22 శాతం తగ్గింది. విలువ పరంగా ఇది రూ. 133.260 కోట్లు.
కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ ఆంక్షలకు తోడు, బంగారం ఆల్ టైం ధరల నేపథ్యంలో 2020 లో భారతదేశ బంగారం డిమాండ్ మూడో వంతు పడిపోయింది. అయితే విలువ పరంగా చూసినప్పుడు ఈ డ్రాప్ గణనీయంగా తక్కువగా ఉంది. అయితే లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు, పండుగ సీజన్‌నే పథ్యంలో బంగారానికి డిసెంబర్ త్రైమాసికం ఆశలను రేకెత్తించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 137.3 టన్నులకు పెరిగింది. ఈకాలంలో పెట్టుబడులుకూడా 8 శాతం పెరిగి 48.9 టన్నులకు చేరుకుంది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 186.2 టన్నులుగా ఉంది, ఇది అంతకుముందు 2019 లో (194.3 టన్నులు) పోలిస్తే 4 శాతం తగ్గింది. విలువ పరంగా, డిమాండ్ 26 శాతం పెరిగి రూ .82.790 కోట్ల రూపాయలుగా ఉంది.
గ్లోబల్ వ్యూ
2020నాటికి, ప్రపంచ డిమాండ్ 3,759.6 టన్నులతో 14శాతం తగ్గింది. 2020లో వినియోగదారుల డిమాండ్ బలహీనపడటం వెనుక కీలకమైన కారణం కరోనా మహమ్మారేని డబ్ల్యుజీసీ తెలిపింది. 2009 తరువాత గ్లోబల్‌గా మొదటిసారి వార్షిక ప్రాతిపదికన పసిడి డిమాండ్ 4వేల టన్నుల మార్క్ కంటే దిగువకు పడి పోయింది.
అయితే 2021వ సంవత్సరం బంగారానికి మంచి సంవత్సరంగా ఉండనుందని సోమసుందరం అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్లు కోవిడ్-19 ఆర్ధిక సంక్షోభ ప్రభావానికి ఇంకా పూర్తిగా గురి కాలేదు. ఆ తర్వాత, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో డిమాండ్ ప్రభావితమవుతుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment