
న్యూఢిల్లీ : పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో, బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో 200 రూపాయల మేర పెరిగిన బంగారం ధరలు నేటి ట్రేడింగ్‌లో మరో వంద రూపాయలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్‌లో 31వేల రూపాయలకు పైన రూ.31,050గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌ను అందుకోవడానికి జువెల్లర్స్ ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారని, దీంతో ధరలు పెరుగుతున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు.
అంతేకాక అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో కూడా ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. డాలర్ మారకంతో రూపాయి విలువ పడిపోవడంతో, దిగుమతి చేసుకుంటున్న మెటల్స్ ఖరీదైనవిగా మారాయని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ భారీగా 54పైసలు పడిపోయి, 64.04గా నమోదైంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్‌కు 0.08 శాతం పెరిగి 1,340.70 డాలర్లుగా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు వంద రూపాయల చొప్పున పెరిగి 10 గ్రాములకు 31,050 రూపాయలుగా, 30,900 రూపాయలుగా నమోదయ్యాయి. కాగ, గత నాలుగు సెషన్ల నుంచి బంగారం ధరలు 475 రూపాయల మేర పెరిగాయి. అటు వెండి కూడా కేజీకి వంద రూపాయలు పెరిగి, 40,300 రూపాయలుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment