
వరుసగా రెండో రోజు పుత్తడి, వెండి ధరలు మెరుస్తున్నాయి. అటు విదేశీ మార్కెట్లో అంటే న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1975 డాలర్లను తాకగా. . ఇటు దేశీయంగా డెరివేటివ్ విభాగంలో 10 గ్రాములు రూ. 52,000కు చేరువైంది. ఇక ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 69,400కు చేరింది. వెరసి బంగారం, వెండి ధరలు తిరిగి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. వివరాలు చూద్దాం..
జోరుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 208 బలపడి రూ. 51,895 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 435 పుంజుకుని రూ. 69,400 వద్ద కదులుతోంది.
లాభాలతో
ఎంసీఎక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. 10 గ్రాముల బంగారం రూ. 368 పుంజుకుని రూ. 51,687 వద్ద ముగిసింది. తొలుత 51,847 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,334 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,037 ఎగసి రూ. 68,965 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 69,200 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,906 వరకూ నష్టపోయింది.
కామెక్స్‌లో అప్
వరుసగా రెండో రోజు న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.6 శాతం పుంజుకుని 1,975 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.45 శాతం బలపడి 1965 డాలర్ల ఎగువన కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.2 శాతం ఎగసి 27.66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.