ముందురోజు ఒడిదొడుకుల మధ్య దేశీ ఫ్యూచర్స్ మార్కెట్లో బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి. నాలుగు రోజుల నష్టాల నుంచి సోమవారం బయటపడిన పసిడి ధరలు.. మంగళవారం చివర్లో పుంజుకున్నాయి. తద్వారా వరుసగా రెండు రోజులపాటు లాభపడ్డాయి. అయితే ప్రస్తుతం విదేశీ మార్కెట్లో వెనకడుగు వేయడంతో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ బలహీనపడ్డాయి. వివరాలు ఇలా..
నేలచూపులో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 200 నష్టంతో రూ. 51,153 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 489 క్షీణించి రూ. 68,005 వద్ద కదులుతోంది.
రెండో రోజూ జోరు
వరుసగా రెండో రోజు మంగళవారం పసిడి, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 288 ఎగసి రూ. 51,353 వద్ద ముగిసింది. తొలుత 51,406 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,629 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 223 బలపడి రూ. 68,494 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,713 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 66,155 వరకూ నీరసించింది. నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం చెక్ పడగా.. పసిడి రూ. 387 ఎగసి రూ. 51,065 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో వెండి మరింత అధికంగా రూ. 1,005 జంప్‌చేసి రూ. 68,271 వద్ద స్థిరపడింది.
కామెక్స్‌లో వీక్
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు నీరసించాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.3 శాతం క్షీణించి 1,937 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లో 0.1 శాతం తక్కువగా 1930 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం ఔన్స్ 0.5 శాతం బలహీనపడి 26.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంగళవారం తొలుత పసిడి, వెండి ధరలు క్షీణించినప్పటికీ చివర్లో పుంజుకోవడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment