లక్ష్యానికి అనుగుణంగా ధరలు బలపడేటంతవరకూ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే కొనసాగించనున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. తాజాగా స్పష్టం చేసింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ బుధవారం పరపతి నిర్ణయాలు ప్రకటించింది. దీంతో తొలుత జోరందుకున్న బంగారం, వెండి ధరలు తదుపరి పతన బాట పట్టాయి. ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు బలపడటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..
దిగువముఖంగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 449 నష్టంతో రూ. 51,375 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,061 క్షీణించి రూ. 67,720 వద్ద కదులుతోంది.
మిశ్రమంగా..
ఎంసీఎక్స్‌లో బుధవారం బంగారం ధర స్వల్పంగా బలపడగా.. వెండి వెనకడుగు వేసింది. 10 గ్రాముల పుత్తడి రూ. 55 పుంజుకుని రూ. 51,824 వద్ద ముగిసింది. తొలుత 52,127 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,750 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 186 క్షీణించి రూ. 68,781 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 69,249 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 68,600 వరకూ నష్టపోయింది.
కామెక్స్‌లో..డీలా
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు బలహీనపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1.25 శాతం క్షీణించి 1,946 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 1 శాతం వెనకడుగుతో 1939 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 2 శాతం పతనమై 26.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment