
సాక్షి, న్యూఢిల్లీ : గత రెండురోజులుగా చుక్కల్ని తాకిన పుత్తడి ధర భారీగా దిగి వచ్చింది. బడ్జెట్‌లో 10 నుంచి 12.5 శాతం దిగుమతి సుంకం ప్రతిపాదన అనంతరం నింగికెగిసిన బంగారం ధరలు మంగళవారం భారీగా క్షీణించాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రా. పసిడి ధర రూ. 600 పడిపోయింది. వెండి ధర రూ. 48 తగ్గి, కిలో ధర రూ. 38,900 పలుకుతోంది.
అంతర్జాతీయంగా బలహీన ధోరణి, బలపడిన డాలరు, దేశీయంగా జ్యుయల్లర్స్‌నుంచి తగ్గిన డిమాండ్ తదితర పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు దిగి వచ్చాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పది గ్రా. బంగారం ధర సోమవారం నాటి రూ. 35, 470 తో పోలిస్తే 600 తగ్గి రూ. 34870గా ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా పది గ్రాముల బంగారం ధర 98 రూపాయిలు క్షీణించి 34,381 వద్ద ఉంది. అయితే సావరిన్ గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి.