పరుగులు పెడుతున్న బంగారం
బ్రెగ్జిట్ దెబ్బతో దూసుకెళ్తున్న పసిడి పరుగుకు బ్రేక్ పడట్లేదు. ఏకంగా రెండేళ్ల గరిష్ట స్థాయిలో పరుగులు తీస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ప్రజాభిప్రాయం ఊహించని విధంగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఆ అనిశ్చిత పరిస్థితిలో ప్రారంభమైన పసిడి దూకుడు, ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో పసిడి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి.
అన్ని కోణాల నుంచి ఫైనాన్సియల్ మార్కెట్లు బలహీన సంకేతాలు అందిస్తున్నాయి. బ్రెగ్జిట్ దెబ్బతో అంతర్జాతీయంగా వస్తున్న ప్రతికూల పవనాలతో ఆసియన్ స్టాక్స్ 31 ఏళ్ల కనిష్టానికి నమోదవుతున్నాయి. దీంతో సురక్షిత సాధనంగా భావిస్తున్న పసిడి వైపు ఎక్కువగా పెట్టుబడులు తరలిపోతూ..అంతర్జాతీయంగా రెండేళ్లకు పైగా గరిష్టంలో పసిడి ధరలు నమోదవుతున్నాయి. స్పాట్ బంగారం ఔన్స్ కు 1,371.40 డాలర్లు(రూ.92,624.29) పైగా ఎగిసింది. 2014 మార్చిలో ఈ స్థాయిలో రికార్డు అయ్యాయి. కమెక్స్ గోల్డ్ ఫ్యూచర్లు 0.9 శాతం పెరిగి, 1,371.10డాలర్ల(రూ.92590.31)గా నమోదవుతోంది. 2010 నుంచి ఇదే అత్యంత పెరుగుదల. దేశీయ మార్కెట్లో సైతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 ఎగిసి రూ.31,953గా నమోదైంది.
బ్రెగ్జిట్ పరిణామం బుల్లిష్ మార్కెట్లో పసిడికి మద్దతు పలుకుతూ సెంటిమెంట్ ను మరింత బలపరుస్తుందని ఎంకేఎస్ ట్రేడర్ జేమ్స్ గార్డినర్ తెలిపారు. బంగారం భారీ స్థాయిలో దూసుకెళ్తుండటంతో, 10 బిలియన్ ఫౌండ్ల విలువ చేసే మూడు బ్రిటీష్ కమర్షియల్ ప్రాపర్టి ఫండ్స్ 24గంటల్లోనే తమ ట్రేడింగ్ లను నిలిపివేశాయి. మరోవైపు ఆయిల్ ధరలు పడిపోతున్నాయి. బ్రెండ్ క్రూడ్ 0.4శాతం పడిపోయి 47.79 డాలర్లుగా నమోదవుతోంది. మంగళవారం ఒక్కరోజు 4.3శాతం బ్రెండ్ క్రూడ్ పతనమైంది.