దీపావళికి ఊరిస్తున్న బంగారం ధరలు
ముంబై: ఒకవైపు పండుగ సీజన్తరుముకొస్తోంటే.. మరోవైపు పసిడి పరుగుకు పడిన బ్రేక్ మగువల మనసును దోచుకుంటోంది. ఛలో.. గోల్డ్ షాపింగ్... అంటూ ఊరిస్తోంది. అవును గత కొన్ని సెషన్లు గా తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు మరింత దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో వరుసగా మూడో రోజు కూడా క్షీణతను నమోదు చేశాయి. బులియన్ మార్కెట్ లో 10 గ్రా. పసిడి మరో 50 రూపాయలు క్షీణించి 30,250 వద్ద ఉంది. ఇదే బాటలో మరో విలువైన లోహం వెండి కూడా పయనిస్తోంది. 150 రూపాయలు పతనమై కిలో వెండి 42,200 లు పలుకుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో 71 పతనమైన 10 గ్రా.పసిడి 29, 638 గా నమోదవుతోంది.
మరోవైపు ప్రపంచవ్యాపితంగా బంగారు ధరలు 0.58 శాతం తగ్గి ఔన్స్ ధర 1,250 డాలర్లుగా ఉండగా, ఒక ఔన్స్ వెండి ధర 0.49 శాతం పతనమై 17.38 డాలర్లుగా ఉంది. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ రూ. 24,300ల వద్ద ఫ్లాట్ గా ఉంది. వెండి నాణేల డిమాండ్ లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.అమెరికా ఫెడ్ రేట్లు పెంచనుందనే అంచనాలతో బులియన్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.అలాగే కోనుగోలుదారుల కొనుగోళ్లు తగ్గిపోవడంతో బులియన్ మార్కెట్ లో బేరిష్ ట్రెండ్ నెలకొందని బులియన్ ట్రేడ్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నగల వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో ఆభరణాలకు , రీటైల్ వర్తకుల డిమాండ్ కూడా తగ్గిందన్నారు.