
డాలర్ ఇండెక్స్ పతనం... అమెరికా– ఉత్తరకొరియా పరస్పర ‘అణు బటన్’ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి వరుసగా నాల్గవ వారమూ దూసుకుపోయింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర వారంలో 15 డాలర్లు బలపడి 1,320 డాలర్లకు చేరింది.
నాలుగు వారాల్లో కనిష్ట స్థాయి నుంచి దాదాపు 80 డాలర్లు పైకి ఎగసింది. దీనికి తక్షణ మద్దతు 1,305 డాలర్లయితే, దాన్ని కోల్పోతే 1,270, 1,240 డాలర్లు. అంతకు మించి తగ్గకపోవచ్చన్నది నిపుణుల మాట. ఇక పెరిగితే 1350 డాలర్ల వద్ద తక్షణ నిరోధం ఉందని, అదీ దాటితే 1375 డాలర్ల వద్ద నిరోధం ఎదురు కావచ్చనేది వారి విశ్లేషణ. ఇక డాలర్ ఇండెక్స్ వారంలో మరో 0.25 సెంట్లు పడిపోయి 91.75కు క్షీణించింది. గడచిన నాలుగువారాల్లో పతనం 2.25 డాలర్లు.
దేశీయంగా స్వల్ప పెరుగుదల
అంతర్జాతీయంగా పసిడి 15 డాలర్లు పెరిగినప్పటికీ, దేశీయంగా రూపాయి బాగా బలపడి డాలర్‌తో మారిస్తే రూ.63.27కు చేరటంతో ఆ ప్రభావం ఇక్కడి ఫ్యూచర్స్ మార్కెట్‌లో కనపడలేదు. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్‌లో వారంలో కేవలం రూ.51 పెరిగి రూ.29,216 కు చేరింది.
ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.185 పెరిగి రూ.29,575 వద్ద ముగియగా, వెండి ధర కేజీకి రూ.300 లాభపడి రూ.38,725 వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా సానుకూల ఆర్థిక పరిణామాలు, మెరుగుపడుతున్న వృద్ధి తదితర అంశాలు కొత్త సంవత్సరంలో పసిడికి తోడ్పాటునిచ్చే అవకాశాలున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment