రెండు నెలల కనిష్టస్థాయికి పుత్తడి
గ్రీసు పరిణామాల నేపథ్యంలో గతవారం దేశీయ మార్కెట్లో పుత్తడి ధర రెండు నెలల కనిష్టస్థాయికి తగ్గింది. ముంబాయి బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి, రూ. 26,535 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి అంతేమొత్తం క్షీణించి రూ. 26,385 వద్ద ముగిసింది. బంగారం తగ్గడానికి నిధులు ఈక్విటీ మార్కెట్లోకి మళ్లడం కూడా ఒక కారణమని బులియన్ ట్రేడర్లు చెప్పారు.
పుత్తడికి డిమాండ్ తగ్గించేదిశగా ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ ప్రవేశపెట్టాలని యోచించడం కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని వారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.4 శాతం క్షీణించి 1173 డాలర్లకు పడిపోయింది. ఈ స్థాయి మూడు వారాల కనిష్టం.