
జీఎస్‌టీపై పరిశ్రమ అటూఇటూ..!
పన్ను రేట్లపై మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు దిశగా కీలక ఘట్టాన్ని పూర్తి చేసేసింది. వివిధ వస్తువులు, సేవలకు పన్ను రేట్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆటోమొబైల్ రంగం స్వాగతించగా, టెలికం మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఆటోమొబైల్స్‌పై అంచనాలకు తగ్గట్లే రేట్లు...
పరిశ్రమ ఆశించినట్టుగానే జీఎస్టీ రేట్లు ఉన్నాయని ఆటోమొబైల్ రంగం పేర్కొంది. మొత్తం మీద వివిధ రకాల పన్నుల భారం తగ్గుతుందని, పరిశ్రమలోని అన్ని విభాగాలూ లబ్ధి పొందుతాయని ఆటోమొబైల్ తయారీ దారుల సంఘం ప్రెసిడెంట్ వినోద్ దాసరి తెలిపారు.
ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచడమే కాకుండా దేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలకు విడిగా వేరే పన్ను రేటును ఖరారు చేయడం ఆయా వాహనాలకు ఊతమిస్తుందని వినోద్ అభిప్రాయపడ్డారు. 10–13 సీట్ల సామర్థ్యంగల వాహనాలను, లగ్జరీ కార్లకు మాదిరిగా 15 శాతం పన్ను పరిధిలోకి చేర్చడంపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని ప్రధానంగా ప్రజా రవాణాకు వినియోగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
టెలికం సేవలు భారం...
టెలికం సేవలను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంపై ఆ శాఖ నిరాశ వ్యక్తం చేసింది. ఇప్పటికే తీవ్రమైన అప్పుల భారాన్ని మోస్తున్న ఈ రంగంపై ప్రభుత్వ నిర్ణయం మరింత భారాన్ని మోపుతుందని అభిప్రాయపడింది. ‘‘గొప్ప సంస్కరణగా జీఎస్టీని టెలికం పరిశ్రమ ప్రశంసించింది. కానీ, 18 శాతం పన్ను రేటుతో మేము నిరాశ చెందాం.
ఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 15 శాతం రేటుకు మించిన పన్నును నిర్ణయిస్తే టెలికం సేవలు మరింత ఖరీదుగా మారతాయని ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం’’ అని సెల్యులర్ ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన ‘డిజిటల్ ఇండియా’, ‘నగదు రహిత భారత్’పై ప్రభావం పడుతుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మ్యాథ్యూస్ అన్నారు. నిత్యాసవసర సేవల్లో భాగమైన టెలికం రంగానికి పన్ను మినహాయింపులు ఉండాలని అభిప్రాయపడ్డారు.
స్థిరీకరణకు 6 నెలలు.. ప్రతిఫలాలకు 3 ఏళ్లు..: క్రిసిల్
జీఎస్‌టీని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత పారిశ్రామిక రంగ స్థిరీకరణకు ఆరు నెలల కాలం పడుతుందని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ వల్ల కలిగే ప్రయోజనాలకు మూడేళ్ల వరకు వేచిఉండాలని తెలిపింది.
ఎఫ్‌ఎంసీజీకి ప్రయోజనకరమే..: జీఎస్‌టీ పన్ను రేట్లు వల్ల ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. కొన్ని హోమ్‌కేర్ ఉత్పత్తులు, షాంపులు మినహా ఇతర ఉత్పత్తులపై పన్ను రేట్లు సానుకూలంగానే ఉన్నాయన్నారు. జీఎస్‌టీ రేట్లు అశించిన స్థాయిల్లోనే ఉన్నాయని, ఇవి పరిశ్రమకు ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. అయితే అధిక రేట్ల వల్ల ఆయుర్వేద్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.