జీఎస్టీతో వారికి రూ.6000కోట్లు ఆదా
Published Thu, Sep 14 2017 8:11 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
సాక్షి, కోల్‌కత్తా : ప్రభుత్వం జూలై 1 నుంచి ప్రవేశపెట్టిన కొత్త పన్నుల విధానం జీఎస్టీతో బొగ్గు వినియోగదారులకు మంచి లాభం చేకూరుతోంది. జీఎస్టీ అనంతరం పన్ను రేట్లు దిగిరావడంతో బొగ్గు వినియోగదారులకు వార్షికంగా రూ.6000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని అధికారిక అంచనాలు వెలువడుతున్నాయి. ప్రీ-జీఎస్టీ కాలంలో బొగ్గుపై ఎక్సైజ్ డ్యూటీలు, వాల్యుయాడెట్ పన్నులు, కేంద్ర విక్రయ పన్నులు వంటి పలు కారణాలతో భారీ మొత్తంలో పన్నులుండేవి.
కానీ జీఎస్టీ అమలు తర్వాత అన్ని పన్నులు, లెవీలు కలిపేసి, కేవలం 5 శాతం జీఎస్టీని మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. పన్ను రేట్లు దిగిరావడంతో వినియోగదారులకు వార్షికంగా రూ.6000 కోట్ల లబ్ది చేకూరుతుందని కోల్ ఇండియాకు చెందిన ఓ అధికారి చెప్పారు. జీఎస్టీ పాలనలో పన్ను విధానం తలకిందులైందని, అవుట్‌పుట్‌కు తక్కువ పన్ను ఉండి, ఇన్‌పుట్‌కు ఎక్కువ పడుతుందన్నారు. జీఎస్టీ పాలనలో 5 శాతం పన్నును కోల్‌కు వేస్తే, తమ ఇన్‌పుట్‌లకు 18-28 శాతం పన్నులు పడుతున్నాయని తెలిపారు.
Advertisement