సాక్షి, అమరావతి: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పునః సమీక్షించనున్నారు. అత్యధిక వస్తువులను తక్కువ శాతం పన్ను పరిధిలో ఉండటంతో ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత రేట్ల సమీక్షించాలని కిందటి నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి.
ప్రస్తుతం 150కిపైగా వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించగా, సుమారు 260 వస్తువులు 5 శాతం శ్లాబులో ఉన్నాయి. నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతుండటంతో జీఎస్టీ పరిధి నుంచి మినహాయించిన వస్తువులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది ప్రతి నెలా సగటు జీఎస్టీ ఆదాయం రూ.1.12 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, లక్ష కోట్లు దాటడమే గగనంగా మారింది. 9 నెలలకు సగటు నెల జీఎస్టీ ఆదాయం రూ.1,00,646 కోట్లకు పరిమితమయ్యింది. ఇదే సమయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార భారం పెరిగిపోతోంది.
దీంతో ఆదాయం భారీగా కోల్పోతున్న సున్నా పన్ను పరిధిలో ఉన్న వస్తువులను గుర్తించి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేయోచనలో ఉన్నారు. ప్రస్తుతం 5%, 12%, 18%, 28% శ్లాబులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈ నాలుగు ట్యాక్స్ శ్లాబులను మూడు శ్లాబులుగా మార్చమని సూచిస్తున్నాయి. 5%, 12% శ్లాబుల్లో ఉన్న వస్తువులను కలిపి 8–9 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడం లేదా, 12, 18% శ్లాబులను కలిపి 15–16 శాతంగా చేయాలని సూచిస్తున్నాయి. ఈ పన్ను రేటు సవరింపును ఒకేసారిగా కాకుండా దశలవారీగా చేపట్టాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో స్థిర ఆదాయం వచ్చే దిశగా మార్చి నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment