శాన్ ఫ్రాన్సిస్కో : కాపీ రైట్ దావాపై రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య జరిగిన అసలు సిసలైన యుద్ధంలో, ఒరాకిల్ పై ఆల్ఫాబెట్ కంపెనీ గూగుల్ ఘన విజయం సాధించింది. ఎంతో కాలంగా సాగుతున్న ఈ యుద్ధంలో మంగళవారం గూగుల్ కు అనుకూలంగా అమెరికా జ్యురీ తీర్పునిచ్చింది. దీంతో ప్రపంచంలో చాలా స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ సాప్ట్ వేర్ ను అభివృద్ధిచేయడానికి గూగుల్ కాపీరైట్ చట్టాలను ఉల్లఘించి జావా లాంగ్వేజ్ అక్రమంగా వాడుతుందని ఒరాకిల్ ఎంతో కాలంగా వాదిస్తున్నది. అయితే అమెరికా కాపీరైట్ చట్టాల ప్రకారం న్యాయబద్ధంగానే జావా డెవలప్ మెంట్ ప్లాట్ ఫామ్ ద్వారా ఆండ్రాయిడ్ సాప్ట్ వేర్ ను గూగుల్ క్రియేట్ చేస్తుందని, దానికి ఎటువంటి చెల్లింపులు అవసరం లేదని జ్యురీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కాపీరైట్ ఉల్లంఘన కింద గూగుల్ పై వేద్దామనుకున్న 900 కోట్ల డాలర్ల జరిమానాపై ఒరాకిల్ కు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లోనే ప్రారంభమయ్యాయి. మంగళవారం ఈ రెండు కంపెనీల వాదనలు జ్యూరీ ఎదుట విచారణకు వచ్చాయి. సాప్ట్ వేర్ డెవలపర్స్ ఈ కేసు తీర్పును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవేళ ఒరాకిల్ గెలిస్తే, సాప్ట్ వేర్ కాపీరైట్ వ్యాజ్యాలు పెరుగుతాయని భయాందోళనలకు కూడా గురయ్యారు. గూగుల్ కు అనుకూలంగా తీర్పురావడంతో వారందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
గూగుల్ ఈ విజయాన్ని ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ లో, జావా ప్రొగ్రామింగ్ కమ్యూనిట్ లో, సాప్ట్ వేర్ డెవలపర్స్ ల విజయంగా అభివర్ణించింది. వినియోగదారులకు కొత్త ప్రొడక్ట్ లను అందించడానికి ప్రీ ప్రొగ్రామింగ్ లాగ్వేంజ్ లు ఇక ఎంతో సహయ పడతాయని తెలిపింది. మరోవైపు గూగుల్ ఈ కోర్ జావా టెక్నాలజీని అక్రమంగా వాడుకుంటూ ఆండ్రాయిడ్ లను డెవలప్ చేస్తుందని తాము గట్టిగా విశ్వసిస్తున్నట్టు ఒరాకిల్ జనరల్ కౌన్సిల్ డోరియన్ డాలే చెప్పారు. దీనిపై మరో అప్పీలుకు వెళ్తామని తెలిపింది.
ఈ కేసు నేపథ్యంలో ఒరాకిల్, గూగుల్ షేర్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా లిమిటెడ్ గా ప్రొగ్రామింగ్ మెటిరియల్ ను సాప్ట్ వేర్ డెవలపర్స్ వాడుకోవచ్చని అమెరికా కాపీరైట్ చట్టాలు ఉన్నాయని అమెరికా జిల్లా జడ్జి విలియం అల్సప్ చెప్పారు. గూగుల్ వాడుకున్న ఈ జావా ఎలిమెంట్స్ కాపీరైట్ ప్రొటక్షన్ కిందకు రావని, చట్టాల ప్రకారం న్యాయబద్ధంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుందని జ్యురీ పేర్కొంది.