
అవగాహన లేకే బాండ్లకు దూరం
♦ ఆన్‌లైన్లోనూ లభ్యమైతే బాగుంటుంది
♦ సెబీ సభ్యుడు మహాలింగం వ్యాఖ్య
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాండ్లలో పెట్టుబడి విషయంలో దేశంలో మదుపరులకు అవగాహన చాలా తక్కువని సెబీ శాశ్వత సభ్యుడు జి.మహాలింగం వ్యాఖ్యానించారు. అసోచామ్ ఆధ్వర్యంలో బుధవారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లకు భద్రత తక్కువనే భావన ప్రజల్లో ఉందన్నారు. ‘‘అది నిజం కాకపోయినా... ఆ విషయంలో సరైన అవగాహన లేకే ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపు మొగ్గు చూపుతున్నారు’’ అని ఆయన చెప్పారు. బాండ్ల కొనుగోలు మరింత సులభం కావాలని, ఆన్‌లైన్లో కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఉండాలని తెలిపారు.
ఈక్విటీలను హై రిస్క్ అసెట్లుగా ఆయన అభివర్ణించారు. రిస్క్ ఉన్నప్పటికీ అధిక రాబడులుంటాయన్న ఆశతోనే రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారని గుర్తు చేశారు. బాండ్లు దీర్ఘకాలిక ఆర్థిక సాధనమని చెప్పారాయన. ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే బాండ్లపై రాబడి సగటున 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) అధికమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ మనోజ్ కుమార్ జైన్ చెప్పారు.
కాగా బాండ్లకు రేటింగ్ ఇచ్చే విధానం మరింత సరళీకృతం కావాలని క్రిసిల్ రిసర్చ్ అసోసియేట్ డైరెక్టర్ భూషన్ కేదర్ చెప్పారు. ప్రస్తుతం ట్యాక్స్ ఫ్రీ బాండ్లకే ఆదరణ ఉంటోందని చెప్పారాయన. మొత్తం బాండ్ల మార్కెట్లో కార్పొరేట్ బాండ్ల వాటా 24 శాతం కాగా మిగిలిన 76 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలదేనని శ్రేయి ఇన్‌ఫ్రా ఫైనాన్స్ ఎస్‌వీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ బాండ్ల విపణి జీడీపీలో 14 శాతం (రూ.19 లక్షల కోట్లు) ఉందని తెలియజేశారు.