బంగారం దిగుమతి టారిఫ్ పెంపు
న్యూఢిల్లీ: దేశంలో బంగారం దిగుమతికి సంబంధించిన టారిఫ్ విలువ పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాములకు 433 డాలర్లుగా ఉన్న టారిఫ్‌ను 445 డాలర్లకు పెంచుతున్నట్లు కేంద్రీయ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బోర్డు(సీబీఈసీ) నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుం టుంది. తద్వారా విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్‌ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే ప్రధానోద్దేశం.
అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఈ టారిఫ్ విలువలో మార్పులను ప్రభుత్వం చేపడుతుంది. కాగా, వెండి దిగుమతి టారిఫ్ విలువను మాత్రం కేజీకి ఇప్పుడున్న 699 డాలర్ల నుంచి 694 డాలర్లకు తగ్గించారు. దేశంలో బంగారం దిగుమతులను అడ్డుకట్టకోసం కస్టమ్స్ సుంకాన్ని 10 శాతానికి పెంచడం, ఇతరత్రా ఆంక్షలు విధించడం తెలిసిందే. వీటి ఫలితంగా 2013-14లో పుత్తడి దిగుమతులు 550 టన్నులకు మించబోవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రితం ఏడాది దిగుతులు 845 టన్నులు.