ప్రవాస భారతీయులకు ఎఫ్‌డీఐ నిబంధనల్లో సడలింపు
కేబినెట్ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయుల(ఓసీఐ)కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనల్లో సడలింపునిచ్చింది. గురువారమిక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
భారత సంతతి వ్యక్తులు(పీఓఐ), ఓసీఐ, ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌డీఐ పాలసీలో సవరణలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఆర్థిక వ్యవస్థ, విద్యకు సంబంధించి పీఓఐ, ఓసీఐలకు ఎన్‌ఆర్‌ఐలతో సమాన హోదా లభిస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. దీనివల్ల భారత్‌లోకి మరిన్ని పెట్టుబడులు, రెమిటెన్సులు(స్వదేశానికి పంపే నగదు) వచ్చేందుకు వీలవుతుందని తెలిపారు.
డీఐపీపీ ప్రతిపాదన ప్రకారం ఈ కేటగిరీలకు చెందిన వ్యక్తులు భారత్‌లో రూపాయిల్లో తీసుకునే ఖాతాల నుంచి ఇక్కడ చేసే పెట్టుబడులను ఇక విదేశీ పెట్టుబడులుగా పరిగణించరు. వీరికి ఎఫ్‌డీఐ పరిమితులు వర్తించవు. వీటిని దేశీ పెట్టుబడులుగానే వ్యవహరిస్తారు. దీనివల్ల విదేశాల్లో భారీగా వ్యాపారాలను నిర్వహిస్తున్న భారతీయులు తమ నిధులను స్వదేశంలోకి సులువుగా తరలించేందుకు దోహదం చేస్తుందనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే రక్షణ, రైల్వేలు, నిర్మాణ రంగం, వైద్య పరికరాలు, బీమా తదితర రంగాల్లో ఎఫ్‌డీఐ విధానాన్ని మోదీ సర్కారు సరళీ కరించిన సంగతి తెలిసిందే.
యూరియా ప్లాంట్లకు రూ.10,500 కోట్లు
జార్ఖండ్‌లోని సింధ్రీ యూరియా ప్లాంట్ పునరుద్ధరణ, అస్సామ్‌లో కొత్తగా ఎరువుల ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్రం రూ.10,500 కోట్లు వెచ్చించనుంది. అదేవిధంగాఉపగ్రహాల లాంచింగ్‌కి మరిన్ని అంతర్జాతీయ కాంట్రాక్టులు దక్కించుకునే దిశగా మరో 15 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ఫ్లయిట్స్‌కి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.