
సాక్షి, బెంగళూర్: ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అనుమతించాలన్న యోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో పెద్దసంఖ్యలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో లేఆఫ్‌లు చోటుచేసుకున్న క్రమంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ కర్గే ఐటీలో ఉద్యోగ సంఘాలకు అనుమతిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూనియన్లను అనుమతించేందుకు ఐటీ-బీటీ చట్టానికి సవరణలు అవసరమని, ఈ సవరణలపై ఆందోళనలు నెలకొన్నాయని మంత్రి చెప్పారు.
అయితే ఐటీ కంపెనీల్లో స్థబ్ధత వీడి పెద్ద ఎత్తున నియామకాలకు దిగుతుండటంతో యూనియన్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి లేదని భావిస్తున్నామని ఐటీ కార్యదర్శి గౌరవ్ గుప్తా చెప్పారు. ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్ వంటి కంపెనీలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ప్రారంభించడంతో ఉద్యోగావకాశాల విషయంలో పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొందని అన్నారు.
ప్రస్తుత ఉద్యోగులకు సైతం నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు కంపెనీలు శిక్షణ ఇస్తుండటం మంచి పరిణామమని చెప్పారు.మరోవైపు చెన్నై, పూణేల్లో ఐటీ యూనియన్‌లు కార్యకలాపాలు కొనసాగుతున్న క్రమంలో బెంగళూర్‌లోనూ ఐటీ యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment