హైదరాబాద్ టు బెంగళూరు
- రాష్ట్ర రియల్టీ వలస...
- ఇక్కడి అనిశ్చితే బెంగళూరుకు వరం
- బెంగళూరులో పెరిగిన ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోళ్లు
- ప్రవాసాంధ్రుల మొగ్గు బెంగళూరుపైనే
- అక్కడ ప్రాజెక్టులు ఆరంభిస్తున్న హైదరాబాద్ బిల్డర్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన అనిశ్చితి బెంగళూరుకు వరంగా మారుతోంది. విభజన ఆందోళనల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల వారూ పెట్టుబడులకు బెంగళూరే సరైన ప్రాంతమనే నిర్ణయానికి వస్తున్నారు. రాష్ట్రానికి చెందిన బిల్డర్లు, డెవలపర్లు భూముల కోసం... కొనుగోలుదారులు ఫ్లాట్లు, ప్లాట్ల కోసం వాకబు చేయడం రోజురోజుకు పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. విభజన ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా బెంగళూరు రియల్టీలోకి ఇక్కడి నుంచి దాదాపు రూ. 1,500 కోట్ల పెట్టుబడులు తరలినట్లు రియల్టీ వర్గాల అంచనా.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో సామాన్యుల నుంచి ఐటీ నిపుణుల వరకు అంద రూ బెంగళూరులోనే నివాసముండేందుకు ఇష్టపడుతున్నారు. ఏడాది కాలంగా హైదరాబాద్‌లో కొత్తగా ఐటీ ఉద్యోగుల నియామకాలూ పెద్దగా లేవు. అదే బెంగళూరులో అయితే రెండింతలకు పైగానే కొత్త ఉద్యోగులొచ్చి చేరారు. దీనికి తోడు ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో కంటే బెంగళూరులోనే తమ సంస్థలను స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రాజె క్టులు ప్రారంభిస్తే కొనుగోళ్లు బాగుంటాయనే అభిప్రాయానికి బిల్డర్లు వచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన ఏఆర్కే ఇన్‌ఫ్రా బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో మూడున్నర ఎకరాల్లో ‘ఆర్క్ సెరిన్ కౌంటీ’ స్టేజ్-2ను శుక్రవారంనాడు ప్రారంభించింది. ఇప్పటికే స్టేజ్-1లో 274 ఫ్లాట్లను నిర్మించామని, ఇందులో 95 మంది కొనుగోలుదారులకు ఇంటి తాళాలు అందజేశామని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ గుమ్మి రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. సాకేత్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా బెంగళూరులోని సర్జాపూర్ రోడ్‌లో 3 ఎకరాల్లో నివాస సముదాయాన్ని నిరిస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ రవి కుమార్ చెప్పారు. మొత్తం 214 ఫ్లాట్లు వచ్చే ఈ ప్రాజెక్టులో చదరపు అడుగు ధర రూ. 4,000 నుంచి రూ. 5,000ల మధ్య ఉందన్నారు.
అన్ని వర్గాల వారూ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీమంతులు బెంగళూరులో భూములు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు, విల్లాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. బెంగళూరు నగరంతో పాటు శివార్లపై కూడా వీరు దృష్టి పెడుతున్నారు. శివార్లలో 50 ఎకరాలు, వంద ఎకరాల చొప్పున భూములను కొనుగోలు చేస్తున్నారని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అనిశ్చితితో పాటు విభజన జరిగితే అభివృద్ధి మందగించవచ్చన్న ఆందోళనలు కూడా అనేక మంది బెంగళూరు బాట పట్టడానికి కారణమవుతున్నాయి.
బిల్డర్లు, డెవలపర్లు ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తే, మధ్య తరగతి కుటుంబాలు అపార్ట్‌మెంట్లపైన, ఎన్నారైలు విల్లాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న మధ్యతరగతి వారు తొమ్మిదో దశకం నుంచే బెంగళూరుకు వలసలు రావడం ప్రారంభించినా, ఇటీవల ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆ వలసలు మరింత ఎక్కువయ్యాయని, వీరంతా ప్రధానంగా రూ.35 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య పలికే అపార్ట్‌మెంట్ల గురించి వాకబు చేస్తున్నారని డె వలపర్లు చెబుతున్నారు.
ప్రవాసులూ బెంగళూరు వైపే: విదేశాల్లోని ప్రవాసాంధ్రులు కూడా పెట్టుబడులకు బెంగళూరే అనువైన ప్రాంతమని గట్టిగా విశ్వసిస్తున్నారు. వీరంతా రూ.కోటి నుంచి రూ.5 కోట్లు పలికే లగ్జరీ విల్లాల గురించి వాకబు చేస్తున్నారు. వీరి ఆసక్తిని గమనించిన పలువురు బెంగళూరు బిల్డర్లు ప్రవాసులకు ప్రత్యేక రాయితీలను కూడా ఇస్తున్నారు. ఐటీలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పట్లో బెంగళూరును అధిగమించడం హైదరాబాద్ సహా ఇతర మెట్రోలకు సాధ్యంకాదనేది వారి అభిప్రాయం. పైగా బెంగళూరులో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా బెంగళూరులో స్థిరపడాలంటే సొంతగూడు అవసరమని అందరూ భావిస్తుండటం అక్కడి రియల్‌బూమ్‌కు బాటలు పరుస్తోంది.
హైదరాబాద్‌లో ఇదే కరెక్ట్ టైం: హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత కొనుగోలుదారులకు కలిసొస్తోందని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (అప్రెడా) జనరల్ సెక్రటరీ విజయ్‌సాయి చెప్పారు. ‘‘బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో ప్రస్తుతం ఫ్లాట్లు, ప్లాట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మరో ఆరేడు నెలల్లో అనిశ్చితి తొలిగి తిరిగి రియల్‌బూమ్ పెరుగుతుంది. రేట్లు పెరగొచ్చు. అందుకే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం’’ అన్నారాయన.