హైదరాబాద్ టు బెంగళూరు రియల్టీ వలస
* పెట్టుబడుల వెల్లువ
* అక్కడి అనిశ్చితి.. ఇక్కడికి వరం
* సమైక్యాంధ్ర ఆందోళనతో ఇక్కడ ‘రియల్’ ఊపు
* బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలపై ఏపీ శ్రీమంతుల దృష్టి
* భూములు, సైట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాల కొనుగోలులో నిమగ్నం
* భారీ విస్తీర్ణంలో భూముల కొనుగోళ్లు
* అమెరికాలోని ప్రవాసాంధ్రులూ ‘బెంగళూరు’ వైపే మొగ్గు
* హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులూ భారీగా వలస
బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు బెంగళూరుకు వరంలా పరిణమించాయి. సమైక్యాంధ్ర ఆందోళన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల వారు బెంగళూరును పెట్టుబడుల స్వర్గధామంగా భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరు రియల్టీ రంగంలోకి సుమారు రూ.1,500 కోట్లు వచ్చాయని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీమంత సామాజిక వర్గం వారు భూములు, సైట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాల కొనుగోలులో నిమగ్నమయ్యారు.
బెంగళూరు చుట్టుపక్కలతో పాటు నగరానికి దక్షిణానే వీరి దృష్టంతా కేంద్రీకృతమైంది. నగర శివార్లలో 50 ఎకరాలు, వంద ఎకరాలు...ఇలా పెద్ద విస్తీర్ణంలో భూములను కొనుగోలు చేస్తున్నారని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరో వైపు తెలుగు బిల్డర్లు, డెవలపర్లు భూముల కోసం వాకబు చేయడం రోజు రోజుకు పెరుగుతోందని తెలిపారు. హైదరాబాద్ పరిస్థితి అనిశ్చితంగా మారడంతో పాటు తెలంగాణ రాజధాని అయితే ఇప్పటిలా అభివృద్ధి జరగకపోవచ్చనే అనుమానాలతో అనేక మంది బెంగళూరు బాట పడుతున్నారు.
బిల్లర్లు, డెవలపర్లు ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తే, మధ్య తరగతి కుటుంబాలు అపార్ట్‌మెంట్లు, ఎన్‌ఆర్‌ఐలు విల్లాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఐటీ రంగంలోని పని చేస్తున్న ఈ మధ్య తరగతి వారు తొమ్మిదో దశకం నుంచే బెంగళూరుకు వలసలు రావడం ప్రారంభించినా, ఇటీవల ఏర్పడిన పరిస్థితులు కారణంగా ఆ వలసలు మరింత ఎక్కువయ్యాయి. వీరంతా ప్రధానంగా రూ.35 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు ధర పలికే అపార్ట్‌మెంట్ల గురించి వాకబు చేస్తున్నారు.
అమెరికాలో ఐటీ రంగంలో పని చేస్తున్న ప్రవాసాంధ్రులు కూడా తమ పెట్టుబడులకు బెంగళూరే అనువైన ప్రాంతమని గట్టిగా విశ్వసిస్తున్నారు. రూ.కోటి నుంచి రూ.5 కోట్లు పలికే లగ్జరీ విల్లాల గురించే వారు వాకబు చేస్తున్నారు. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే, అది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కనీసం రెండు దశాబ్దాలైనా పడుతుందని వారు అంచనా వేస్తున్నారు.
ఐటీలో దూసుకు పోవడం, ఈ రంగంలో వృద్ధి నిర్నిరోధంగా కొనసాగుతుండడంతో పాటు సమీప భవిష్యత్తులో బెంగళూరును తలదన్నడం హైదరాబాద్ సహా ఇతర మెట్రోలకు సాధ్యం కాదని వారు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. పైగా బెంగళూరులో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటా యి. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా బెంగళూరులో స్థిర పడాలంటే సొంత గూడు అవసరమని అందరూ భావిస్తుండడం రియల్ బూమ్‌కు బాటలు పరుస్తోంది. దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఇదే ఆలోచనతో ఉన్నారు.