ఎంఎంటీసీలో 15% ప్రభుత్వ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంఎంటీసీలో 15 శాతం వాటాలు విక్రయించడం ద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు 15 కోట్ల షేర్లను విక్రయించవచ్చని సంస్థ చైర్మన్ వేద్ ప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం రూ. 52.80గా ఉన్న ఎంఎంటీసీ షేరు ధరను బట్టి చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 800 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎంఎంటీసీలో కేంద్రానికి 80.93 శాతం వాటాలు ఉన్నాయి.
మరోవైపు, ఆంక్షలు సడలించిన దరిమిలా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంఎంటీసీ 50 టన్నుల మేర పసిడి దిగుమతి చేసుకోనున్నట్లు వేద్ ప్రకాశ్ తెలిపారు. అలాగే, వెండి దిగుమతులు 200 టన్నులకు పెరుగుతాయన్నారు.