
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించడంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) సమర్థంగా నియంత్రించేందుకు తమకు పూర్తి అధికారాల్లేవంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 13,500 కోట్ల కుంభకోణం బైటపడటం, పీఎస్‌బీల పర్యవేక్షణలో ఆర్‌బీఐ విఫలమైందన్న ఆరోపణలు రావడం సంగతి తెలిసిందే. మరోవైపు, 20 పీఎస్‌బీల్లో కేంద్రానికి ఉన్న మెజారిటీ వాటాలను తగ్గించేసుకోవాలన్న ప్రతిపాదనేదీ లేదని గోయల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనం సమకూర్చడం ద్వారా వాటికి తగు తోడ్పాటు అందిస్తామన్నారు.
ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రమాణాలను, నైతికతను పాటించడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. పీఎస్‌బీల్లో గతంలో రాజకీయ జోక్యం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితుల్లేవని గోయల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment