
టాక్స్ రిటర్న్స్ దాఖలుకు చివరి అవకాశం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. పెండింగ్ టాక్స్ రిటర్న్స్ క్లియర్ చేయడానికి ప్రత్యక్షపన్నుల శాఖ మరో చివరి అవకాశాన్ని ప్రకటించింది. గత ఆరేళ్లుగా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. 2009 నుంచి 2016 వరకు ఇంకా తమ టాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయనివారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మరో అవకాశం కల్పిస్తోంది. ఈ మొత్తం ఆరేళ్లకు కలిపి ఒకేసారి రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. ఈలోగా తమ రిటర్స్ ను ఫైల్ చేయాలని, లేదంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. అంతేకాదు ఇదే చివరి అవకాశమని కూడా స్పష్టం చేసింది.
ఇప్పటికే ఆన్ లైన్ లో రిటర్న్స ఫైల్ చేసిన వారు 'ఐటీఆర్ ధ్రువీకరణ' (ఐటిఆర్ -వెరిఫికేషన్) పత్రాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది. ఆదాయం పన్ను శాఖ బెంగళూరు ఆధారిత సేకరణ కేంద్రం నుంచి ఐటీఆర్-వి రసీదు కాపీ 120 రోజుల లోపుల పన్ను చెల్లింపుదారులకు చేరాలని, ఒకవేళ చేరకపోతే ఆ చెల్లింపును చెల్లనిదిగా పరిగణిస్తారని పేర్కొంది. కావాలంటే ఐటీఆర్ వీ స్టేటస్ ను టాక్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికి పాన్ నెంబర్, సంబంధిత అంచనా సంవత్సారాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని టాక్స్ ప్లానర్.కామ్ ప్రతినిధి సుధీర్ కౌశిక్ తెలిపారు. ఇపుడు ఫైల్ చేయకపోతే, రిఫండ్స్ ప్రాసెస్ చేయడం జరగదన్నారు. వీటిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అనుమతి ఉండదని కౌశిక్ వివరించారు. మరోవైపు ఇపుడు విఫలమైతే మొత్తం అన్నిసంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటారని, కనీసం రూ. 5,000 జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందుకే మరింత ఆలస్యం లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కాగా గత ఏడాది ఆధార్ కార్డు ద్వారా ఐటీఆర్-వీ, ఓటీపీ వెరిఫికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకునేలా ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5 శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి.