గ్రోత్‌ మంచిదా? డివిడెండ్‌ మంచిదా? | Growth is good? Dividend is good | Sakshi
Sakshi News home page

గ్రోత్‌ మంచిదా? డివిడెండ్‌ మంచిదా?

Published Mon, Jul 24 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

గ్రోత్‌ మంచిదా? డివిడెండ్‌ మంచిదా?

గ్రోత్‌ మంచిదా? డివిడెండ్‌ మంచిదా?

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. డివిడెండ్, గ్రోత్‌లలో ఏ ఆప్షన్‌ను ఎంచుకోవాలో తెలియడం లేదు. ఇన్వెస్టర్లకు వచ్చే డివిడెండ్లపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) లేనందున డివిడెండ్‌ ఆప్షన్‌ బావుంటుందని అనుకుంటున్నాను.  ఇది సరైనదేనా ? తెలియజేయండి.
–ఆదిత్య, నెల్లూరు

మీకు లభించే డివిడెండ్లపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) ఉండదన్న ఒకే ఒక కారణంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం సరికాదు. ప్రతి నెలా, లేదా మూడు నెలలకొకసారి ఇలా వివిధ కాలవ్యవధుల్లో మీకు ఖచ్చితంగా నగదు అవసరమైన పక్షంలో మాత్రమే డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైరైన వారికి ఇలా నగదు అవసరాలు అధికంగా ఉంటాయి కనక వారు మ్యూచువల్‌ ఫండ్, డివిడెండ్‌ను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే, గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌లో మీకు కాంపౌండింగ్‌ ప్రయోజనాలు లభించి మంచి రాబడులొస్తాయి. ఒక వేళ మీరు డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకుందాం. వచ్చిన డివిడెండ్‌ను అనవసర వ్యయాలకో, ఇతర విలాసాలకో, దుబారాలకో ఖర్చు చేసే అవకాశాలే అధికంగా ఉంటాయి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఆ ఫండ్‌ యూనిట్లను ఒక ఏడాది తర్వాత విక్రయిస్తే, మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు డివిడెండ్‌ లేదా గ్రోత్‌.. ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా ఇది వర్తిస్తుంది. అందుకని కేవలం పన్ను కోత ఉండదనే ఉద్దేశంతో మాత్రమే డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం సరికాదు.

నేను డెట్‌ఫండ్‌లో రూ.10 లక్షలు మూడేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మూడేళ్ల తర్వాత ప్రతి మూడు నెలలకు రూ.50,000 చొప్పున సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్స్‌ ద్వారా ఏడాదికి రూ.2 లక్షలు చొప్పున ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. ఈ రూ.2 లక్షల ఉపసంహరణలపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? ఈ పన్ను భారం ఎంత వరకూ ఉంటుంది ?
–కిరణ్, విజయవాడ

డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి, మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, మీరు పొందే లాభాలపై ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌తో 20 శాతం చొప్పున మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక ఇన్వెస్టర్‌ ఒక డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. రూ.10 విలువ గల ఒక్కో డెట్‌ ఫండ్‌యూనిట్లను వంద కొనుగోలు చేశారనుకుందాం. అంటే ఆ ఇన్వెస్టర్‌ పెట్టిన పెట్టుబడి రూ.వెయ్యిగా ఉంది. నాలుగేళ్ల తర్వాత ఒక్కో యూనిట్‌ను రూ.15కు అమ్మితే, ఆ ఇన్వెస్టర్‌కు మొత్తం రూ.1,500 వస్తాయి. అప్పుడు మూలధన లాభం ఒక్కో యూనిట్‌కు రూ.5 చొప్పున మొత్తం రూ.500గా ఉంటుంది.  ద్రవ్యోల్బణం ఏడాదికి 2.5 శాతం చొప్పున పెరిగి ఈ నాలుగేళ్ల కాలంలో మొత్తం 10 శాతం అయిందనుకుందాం. ఈ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ ఇన్వెస్టర్‌ ఒక్కో యూనిట్‌ను కొన్న వెల రూ.11 అవుతుంది. అప్పుడు ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ పరంగా చూస్తే ఆ ఇన్వెస్టర్‌ పొందిన మూలధన లాభం రూ.4గా ఉంటుంది. ఈ రూ.4పై 20 శాతం చొప్పున పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే ఆ ఇన్వెస్టర్‌ రూ.1,000 ఇన్వెస్ట్‌ చేస్తే, రూ.500 లాభం వస్తుంది. 10 శాతం ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ రూ.100 తీసివేస్తే, లెక్కించాల్సిన మూలధన లాభం రూ.400గా ఉంటుంది. దీనిపై 20 శాతం పన్ను అంటే రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీ విషయానికొస్తే, మీరు ఏడాదికి వెనక్కి తీసుకునే మొత్తం రూ.2 లక్షలపై పన్ను ఉండదు. కేవలం మీరు పొందిన లాభాలపై (ఈ రూ.2 లక్షల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి) మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదికూడా ఆ లాభాల నుంచి ద్రవ్యోల్బణ సర్దుబాటు మొత్తాన్ని తీసివేసిన తర్వాతనే పన్ను కట్టాల్సి ఉంటుంది.

దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఓరియంటెడ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చా ?
–అర్షద్, హైదరాబాద్‌

క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఓరియంటెడ్‌ ఫండ్స్‌–ఇవి క్లోజ్‌డ్‌ ఎండెడ్‌ ఫండ్స్, వీటి కాలపరిమితి 3–5 ఏళ్లు. ఈ ఫండ్స్‌ తమ మొత్తం పెట్టుబడుల్లో 15–20 శాతం ఈక్విటీల్లో, 75–85 శాతం స్థిర ఆదాయం వచ్చే సాధనాల్లో  ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటిపై రాబడులు స్వల్పంగానే ఉంటాయి. కాకపోతే పెట్టుబడులు భద్రంగా ఉంటాయనే ఒకే ఒక సానుకూలాంశం ఈ ఫండ్స్‌కు ఉంది.  మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ ఫండ్స్‌ సరికాదు. ఈ ఫండ్స్‌కు బదులుగా, మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌ (ఎంఐపీ), బ్యాలన్స్‌డ్, లేడా ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. మీరు 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ముందుగా ఒక బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో 3–5 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత, మల్టీక్యాప్‌ ఫండ్‌కు మారండి. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో మదుపు చేయండి. పెద్ద మొత్తంలో మీ దగ్గర డబ్బులున్నప్పటికీ, ఒకేసారి ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేయకండి. ఈ మొత్తాన్ని 15–18 నెలల కాలానికి సమంగా ఇన్వెస్ట్‌ చేయండి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement