న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్‌టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన నివేదికలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తన సిఫారసులను పేర్కొంది.
ఆదాయపు పన్ను మూడు రకాలే...
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్ ఫోర్స్ సిఫారసుల్లో అత్యంత కీలకమైన సంస్కరణ. ప్రస్తుతం 5, 20, 30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించి, 5 శాతం, 10 శాతం, 20 శాతం రేట్లను తీసుకురావాలని సూచించింది. అంటే పై స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తీసుకురావాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు.
మరో ప్రతిపాదన ప్రకారం... రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. అంటే రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది.
రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
డీడీటీకి మంగళం?
‘‘డీడీటీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్‌పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్‌చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్‌పై నికర పన్ను 20.3576 శాతం అవుతోంది. డివిడెండ్‌పై కార్పొరేట్ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు మార్కెట్ పార్టిసిపెంట్లు (బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు) రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు.
విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్‌పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్ ఫోర్స్ సూచన. ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను ను కూడా కొనసాగించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment