DDT
-
‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: మందగమన బాటలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్వెస్టర్ల సెంటిమెంటును మెరుగుపర్చేందుకు, విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు.. మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనుంది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) ట్యాక్స్, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)లను తగ్గించే విధంగా.. వాటి స్వరూపాన్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీతి అయోగ్, ఆర్థిక శాఖలో భాగమైన రెవెన్యూ విభాగంతో కలిసి ప్రధాని కార్యాలయం (పీఎంవో) వీటిని సమీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నవంబర్ ఆఖరు నాటికి దీనిపై కసరత్తు పూర్తి కావచ్చు. బడ్జెట్లో లేదా అంతకన్నా ముందే ఇందుకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చు‘ అని వివరించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న కేంద్రం ప్రవేశపెట్టవచ్చని అంచనా. సావరీన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా తదితర రంగాల సంస్థలు.. దేశీ ఈక్విటీల్లో మరింత పెట్టుబడులు పెంచేందుకు ప్రోత్సహించే విధంగా ..ఇతర దేశాలకు దీటుగా దేశీయంగా పన్ను రేట్లను సవరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు. ‘ఈక్విటీ, డెట్, కమోడిటీల మార్కెట్ల పన్ను రేట్లను సమీక్షిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో పన్నుల విధానాన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పెన్షన్ ఫండ్స్ నుంచి దేశీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు ఆకర్షించాలంటే పెద్ద ప్రతిబంధకంగా ఉంటోందన్న అభిప్రాయాల నేపథ్యంలో డీడీటీని గణనీయంగా తగ్గించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష పన్నులను సమీక్షించేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. దీన్ని ఏకంగా తొలగిం చాలని సిఫార్సు చేసింది‘ అని వివరించారు. ఎల్టీసీజీ..డీడీటీ..ఏంటంటే.. షేర్ల విక్రయంతో ఇన్వెస్టరుకు లాభాలు వచ్చిన పక్షంలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పైబడి అట్టే పెట్టుకున్న షేర్లను విక్రయిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10 శాతం ఎల్టీసీజీ అమల్లోకి వచ్చింది. ఒకవేళ లాభాలు రూ. లక్ష దాటితేనే ఇది వర్తిస్తుంది. ఏడాది వ్యవధి లోపే షేర్లను విక్రయించిన పక్షంలో స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ) ట్యాక్స్ 15% మేర వర్తిస్తుంది. ఇక, కంపెనీలు తమ వాటాదారులకు పంచే డివిడెండుపై ప్రస్తుతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(సెస్సులు, సర్‌చార్జీలన్నీ కలిపి) 20.35% స్థాయిలో ఉంటోంది. ఎల్టీసీజీ, డీడీటీలపై దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. రూ. 1.5 లక్ష కోట్ల ఆదాయానికి గండి.. పన్ను రేట్లలో కోతలతో ప్రభుత్వ ఖజానాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను మరింతగా విక్రయించడం, పన్ను రాబడులను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను నియంత్రించుకోవడం వంటి చర్యలతో దీన్ని భర్తీ చేసుకోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత కొద్ది నెలలుగా పలు సంస్కరణలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై మరింత దూకుడు, బడ్జెట్లో జరిపిన కేటాయింపులను వినియోగించుకునేలా ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ బ్యాంకులు.. చిన్న సంస్థలకు రుణాలిచ్చేలా చర్యలు వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆగ్నేయాసియా మొత్తం మీద భారత్‌లోనే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువగా ఉంది. ఈ సంస్కరణలు.. దేశీ స్టాక్ మార్కెట్లకు, ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిస్తున్నాయి. ఆదాయపు పన్ను రేటూ తగ్గింపు: డీబీఎస్ కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటును కూడా భారత్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచవచ్చని వివరించింది. రూ. 5 లక్షలకు పైబడిన ఆదాయాలపైనా ట్యాక్స్ రేటును తగ్గించవచ్చని తెలిపింది. దీని వల్ల చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందని, మధ్య స్థాయిలో ఉన్న వారికీ ఓ మోస్తరు ఊరట లభించగలదని.. పై స్థాయి శ్లాబ్‌లో ఉన్న వారికి మాత్రమే పన్ను భారం పెరగవచ్చని డీబీఎస్ బ్యాంకు పేర్కొంది. -
డీటీసీతో ‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన నివేదికలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తన సిఫారసులను పేర్కొంది. ఆదాయపు పన్ను మూడు రకాలే... వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్ ఫోర్స్ సిఫారసుల్లో అత్యంత కీలకమైన సంస్కరణ. ప్రస్తుతం 5, 20, 30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించి, 5 శాతం, 10 శాతం, 20 శాతం రేట్లను తీసుకురావాలని సూచించింది. అంటే పై స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తీసుకురావాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు. మరో ప్రతిపాదన ప్రకారం... రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. అంటే రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీడీటీకి మంగళం? ‘‘డీడీటీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్‌పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్‌చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్‌పై నికర పన్ను 20.3576 శాతం అవుతోంది. డివిడెండ్‌పై కార్పొరేట్ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు మార్కెట్ పార్టిసిపెంట్లు (బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు) రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్‌పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్ ఫోర్స్ సూచన. ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను ను కూడా కొనసాగించాలని పేర్కొంది. -
గ్రోత్ మంచిదా? డివిడెండ్ మంచిదా?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. డివిడెండ్, గ్రోత్లలో ఏ ఆప్షన్‌ను ఎంచుకోవాలో తెలియడం లేదు. ఇన్వెస్టర్లకు వచ్చే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) లేనందున డివిడెండ్ ఆప్షన్ బావుంటుందని అనుకుంటున్నాను. ఇది సరైనదేనా ? తెలియజేయండి. –ఆదిత్య, నెల్లూరు మీకు లభించే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) ఉండదన్న ఒకే ఒక కారణంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం సరికాదు. ప్రతి నెలా, లేదా మూడు నెలలకొకసారి ఇలా వివిధ కాలవ్యవధుల్లో మీకు ఖచ్చితంగా నగదు అవసరమైన పక్షంలో మాత్రమే డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైరైన వారికి ఇలా నగదు అవసరాలు అధికంగా ఉంటాయి కనక వారు మ్యూచువల్ ఫండ్, డివిడెండ్‌ను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్లో మీకు కాంపౌండింగ్ ప్రయోజనాలు లభించి మంచి రాబడులొస్తాయి. ఒక వేళ మీరు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకుందాం. వచ్చిన డివిడెండ్‌ను అనవసర వ్యయాలకో, ఇతర విలాసాలకో, దుబారాలకో ఖర్చు చేసే అవకాశాలే అధికంగా ఉంటాయి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫండ్ యూనిట్లను ఒక ఏడాది తర్వాత విక్రయిస్తే, మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు డివిడెండ్ లేదా గ్రోత్.. ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా ఇది వర్తిస్తుంది. అందుకని కేవలం పన్ను కోత ఉండదనే ఉద్దేశంతో మాత్రమే డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం సరికాదు. నేను డెట్ఫండ్లో రూ.10 లక్షలు మూడేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మూడేళ్ల తర్వాత ప్రతి మూడు నెలలకు రూ.50,000 చొప్పున సిస్టమాటిక్ విత్‌డ్రాయల్స్ ద్వారా ఏడాదికి రూ.2 లక్షలు చొప్పున ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. ఈ రూ.2 లక్షల ఉపసంహరణలపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? ఈ పన్ను భారం ఎంత వరకూ ఉంటుంది ? –కిరణ్, విజయవాడ డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, మీరు పొందే లాభాలపై ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో 20 శాతం చొప్పున మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక ఇన్వెస్టర్ ఒక డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. రూ.10 విలువ గల ఒక్కో డెట్ ఫండ్యూనిట్లను వంద కొనుగోలు చేశారనుకుందాం. అంటే ఆ ఇన్వెస్టర్ పెట్టిన పెట్టుబడి రూ.వెయ్యిగా ఉంది. నాలుగేళ్ల తర్వాత ఒక్కో యూనిట్‌ను రూ.15కు అమ్మితే, ఆ ఇన్వెస్టర్‌కు మొత్తం రూ.1,500 వస్తాయి. అప్పుడు మూలధన లాభం ఒక్కో యూనిట్‌కు రూ.5 చొప్పున మొత్తం రూ.500గా ఉంటుంది. ద్రవ్యోల్బణం ఏడాదికి 2.5 శాతం చొప్పున పెరిగి ఈ నాలుగేళ్ల కాలంలో మొత్తం 10 శాతం అయిందనుకుందాం. ఈ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ ఇన్వెస్టర్ ఒక్కో యూనిట్‌ను కొన్న వెల రూ.11 అవుతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ పరంగా చూస్తే ఆ ఇన్వెస్టర్ పొందిన మూలధన లాభం రూ.4గా ఉంటుంది. ఈ రూ.4పై 20 శాతం చొప్పున పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే ఆ ఇన్వెస్టర్ రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే, రూ.500 లాభం వస్తుంది. 10 శాతం ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ రూ.100 తీసివేస్తే, లెక్కించాల్సిన మూలధన లాభం రూ.400గా ఉంటుంది. దీనిపై 20 శాతం పన్ను అంటే రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీ విషయానికొస్తే, మీరు ఏడాదికి వెనక్కి తీసుకునే మొత్తం రూ.2 లక్షలపై పన్ను ఉండదు. కేవలం మీరు పొందిన లాభాలపై (ఈ రూ.2 లక్షల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి) మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదికూడా ఆ లాభాల నుంచి ద్రవ్యోల్బణ సర్దుబాటు మొత్తాన్ని తీసివేసిన తర్వాతనే పన్ను కట్టాల్సి ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడానికి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చా ? –అర్షద్, హైదరాబాద్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ ఫండ్స్–ఇవి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్, వీటి కాలపరిమితి 3–5 ఏళ్లు. ఈ ఫండ్స్ తమ మొత్తం పెట్టుబడుల్లో 15–20 శాతం ఈక్విటీల్లో, 75–85 శాతం స్థిర ఆదాయం వచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిపై రాబడులు స్వల్పంగానే ఉంటాయి. కాకపోతే పెట్టుబడులు భద్రంగా ఉంటాయనే ఒకే ఒక సానుకూలాంశం ఈ ఫండ్స్‌కు ఉంది. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ ఫండ్స్ సరికాదు. ఈ ఫండ్స్‌కు బదులుగా, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ (ఎంఐపీ), బ్యాలన్స్డ్, లేడా ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. మీరు 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ముందుగా ఒక బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో 3–5 ఏళ్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మల్టీక్యాప్ ఫండ్‌కు మారండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో మదుపు చేయండి. పెద్ద మొత్తంలో మీ దగ్గర డబ్బులున్నప్పటికీ, ఒకేసారి ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. ఈ మొత్తాన్ని 15–18 నెలల కాలానికి సమంగా ఇన్వెస్ట్ చేయండి.