జూన్‌11న జీఎస్‌టీ కౌన్సిల్‌ తుది భేటీ | GST Council to meet on June 11 to review rates, amend rules | Sakshi
Sakshi News home page

జూన్‌11న జీఎస్‌టీ కౌన్సిల్‌ తుది భేటీ

Published Fri, Jun 9 2017 6:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

GST Council to meet on June 11 to review rates, amend rules

న్యూఢిల్లీ:  జూలై 1వ తేదీ నుంచి  ప్రతిష్టాత్మక జీఎస్‌టీ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని   కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ మేరకు జీఎస్‌టీ కౌన్సిల్‌  తుది సమావేశం  జూన్ 11న తేదీన  నిర్వహించనున్నట్టు శుక్రవారం చెప్పారు. బహుశా ఇది చివరి  భేటీ అవుతుందన్నారు. పలు వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం జరిగే కౌన్సిల్ సమావేశంలో సమీక్షించనున్నట్టు  తెలిపారు.

జూన్ 3వ తేదీన జరిగిన 15వ సమావేశంలో సభ్యులు సూచించిన సవరణలు, జీఎస్‌టీ డ్రాఫ్ట్ రూల్స్, రేటు సవరణలను 16వ సమావేశంలో ప్రధానంగా చర్చించి అంగీకారం తెలపనున్నట్లు చెప్పారు. దీంతో పాటు వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన వినతులపై కూడా కౌన్సిల్ చర్చిస్తుందన్నారు.
మరోవైపు తమపై విధించిన జీఎస్టీ రేటుపై సమీక్షించాల్సిందిగా ఆటో పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. మధ్యశ్రేణి నుంచి లార్జ్ సైజ్ హైబ్రిడ్ కార్లపై విధించే 43 శాతం పన్నును సమీక్షించాల్సిందిగా కోరాయి. ఈ పన్ను రేటు ప్రస్తుతం 30.3 శాతంగా ఉంది. అదేవిధంగా టెలికాం సెక్టార్ సైతం తమపై 18 శాతంగా ఉన్న పన్నును సమీక్షించాల్సిందిగా కోరింది. అలాగే సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( సీవోఏఐ )  కూడా ఇప్పటికే రెవెన్యూ సెక్రటరీకి ఈ మేరకు ఓ లేఖ కూడా రాసింది. ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమ సైతం ఐటీ ఉత్పత్తులు మానిటర్లు,  ప్రింటర్లులాంటి కొన్ని అంశాలకు ప్రతిపాదించిన 28 శాతం బదులుగా  ఏకరూప పన్ను విధానం తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

కాగా జీఎస్‌టీ కౌన్సిల్ ఇప్పటికే దాదాపు అన్ని వస్తు, సేవలపై పన్నులను నిర్ణయించింది. వివిధ రకాల వస్తువులపై 5, 12, 18, 28 శాతంగా పన్నులను ఖరారు చేసింది. విలువైన లోహాలు, బంగారు నాణేలు , అనుకరణ ఆభరణాలు,  బంగారంపై 3శాతం శ్లాబ్‌ను నిర్ణయించింది.  ముడి డైమండ్లపై 0.25శాతం పన్ను రేటును విధించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement