జూన్ 11 వరకే పెళ్లిసందడి
కొవ్వూరు :గోదావరి పుష్కరాల నేపథ్యంలో జూన్ 11 తర్వాత ఏడాది పాటు వివాహాలు చేయకూడదని పండితులు సూచిస్తున్న నేపథ్యంలో తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి ఊపందుకుంది. ఇప్పటికే వేలాది పెళ్లిళ్లు జరిగాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణ, ముహుర్తాల విషయంలో పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పుష్కరాలు పూర్తయ్యూక ఆరునెలల పాటు చేయకూడదని కొందరు, ఏడాది పాటు శుభకార్యాలు నిర్వహించకూడదని మరికొందరు చెబుతున్నారు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పటి (జూలై 14 పుష్కరాల ప్రారంభం) నుంచి నదికి తూర్పుభాగంలో ఉన్నవారు ఏడాది పాటు, పశ్చిమతీరంలో ఉన్న వారు విజయదశమి వరకు (నాలుగు నెలలపాటు) వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు.
సింహరాశిలో ఉన్న తొమ్మిది పాదాలలో మొదటి ఐదు పాదాలు అనగా జూలై 14 నుంచి సెప్టెంబర్ 30 వరకు, పుబ్బ రెండో పాదంలో గురు అతిచారంతో దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా శుభకార్యాలు చేయడం సింహ, గురు దోషం వల్ల నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 25 నుంచి గోదావరి నదికి పశ్చిమ తీరంలో ఉన్నవారు వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చునంటున్నారు.
గోదావరి నదికి అంత్య పుష్కరాలున్నందున తూర్పు ప్రాంతంలో ఉన్న తూర్పు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లావాసులు ఏడాదిపాటు వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితుల అభిప్రాయం. ఈ ఏడాది జూన్ 17నుంచి ఆగష్టు 14 వరకు అధిక ఆషాడం, నిజ ఆషాడం శూన్యమాసాలు అయినందున వివాహాది శుభకార్యాలకు అనువైన రోజులు కాదని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 9 వరకు గురుమౌఢ్యం, ఆగస్టు 10 నుంచి 20వ తేదీ మధ్య శుక్రమౌఢ్యం ఉండడం వల్ల, భాద్రపదమాసం సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 12 వరకు శూన్యమాసం కావడంతో వివాహాది శుభకార్యాలకు ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.
విజయదశమి నుంచి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు గోదావరి నదికి పశ్చిమ ముఖంగా ఉన్న కృష్ణ, గుంటూరు ఇతర జిల్లాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకోవచ్చునని కొందరు పండితులు చెబుతున్నారు. ఈనెలలో 8, 9, 11, 12, 14, 15, 21, 22, 25 తేదీలు, మార్చినెలలో 4, 6, 7, 8, 11 నుంచి 15 వరకు, ఏప్రిల్ నెలలో 10, 22, 29, మేనెలలో 6, 7, 9, 10, 20, 27, 28, 30, 31వ తేదీలు, జూన్లో 3, 5, 6, 7, 10, 11వ తేదీలు వివాహాలకు అనువైన రోజులని పండితులు చెబుతున్నారు.