గెట్‌.. సెట్‌..జీఎస్‌టీ! | GST impact: Insurance premium, bank charges to increase | Sakshi
Sakshi News home page

గెట్‌.. సెట్‌..జీఎస్‌టీ!

Published Thu, Jun 1 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

గెట్‌.. సెట్‌..జీఎస్‌టీ!

గెట్‌.. సెట్‌..జీఎస్‌టీ!

జూలై 1 నుంచీ దేశమంతా ఒకటే పన్ను  
కేంద్ర, రాష్ట్రాల్లోని కీలక పన్నులన్నీ దీన్లో విలీనం
సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్‌టీగా విభజన
వ్యాపారస్తుల నమోదుకు... జీఎస్‌టీఎన్‌
 

(సాక్షి, బిజినెస్‌ విభాగం)
గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌. ముద్దుగా జీఎస్‌టీ. దీర్ఘకాల తర్జనభర్జనల అనంతరం పార్లమెంటుతో పాటు దేశంలోని రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆమోదించటంతో... జూలై 1 నుంచి దీన్ని అమల్లోకి తేవటానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సరే! అంతవరకూ బాగానే ఉంది. అసలీ జీఎస్‌టీ అంటే ఏంటి? దీన్నెందుకు తెస్తున్నారు? దీన్ని అమలు చేసేదెలా? ఇపుడున్న ఇన్ని పన్నుల స్థానంలో ఒకే పన్నును అమలు చేయటం ఈజీయేనా? వ్యాపారులంతా దాన్లో చేరేదెలా? అసలింతకీ జీఎస్‌టీ వస్తేగిస్తే మనకేంటి లాభం? ధరలేమైనా తగ్గుతాయా... లేక  పెరగబోతున్నాయా? ఏఏ వస్తువుల ధరలు ఎలా ఉంటాయి? ఏఏ సేవల ధరల్లో మార్పులు రాబోతున్నాయి? రాయితీలపై కంపెనీలు పెట్టిన యాజమాన్యాలకు ఇపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని చెబుతాయి? జీఎస్‌టీ వచ్చాక కూడా పన్ను రాయితీలివ్వటం సాధ్యమేనా? ఇవన్నీ చాలామందికి వస్తున్న సందేహాలు. వీటిని నివృత్తి చేయటానికి పలువురు నిపుణులను సంప్రదించి వారి సాయంతో ‘సాక్షి’ బిజినెస్‌ విభాగం ఈ వరస కథనాలను అందిస్తోంది. ‘‘జీఎస్‌టీ... పన్నుల పెద్దన్న’’ శీర్షికన అందిస్తున్న ఈ కథనాలు వరసగా మీ కోసం...

జీఎస్‌టీ. వస్తువుల తయారీ, సరఫరా లేదా సేవలపై విధిస్తారు కాబట్టే దీన్ని వస్తు, సేవల పన్నుగా పిలుస్తున్నారు. వివిధ రకాల పన్నుల స్థానంలో దేశమంతా ఒకటే పన్ను విధానాన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం చేస్తున్న కీలక ప్రయత్నమే ఈ జీఎస్‌టీ.  రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌తో పాటు కేంద్రం విధించే సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, సర్వీస్‌ ట్యాక్స్, సర్‌చార్జిలు, సెస్సులు, సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్, ప్రవేశ పన్ను/ఆక్ట్రాయ్‌ వంటి 17 రకాల పన్నుల స్థానంలో జీఎస్‌టీ ఒక్కటే అమల్లోకి వస్తుంది. దీంతో దేశమంతటా ఒక వస్తువు లేదా సర్వీసుపై ఒకే రకమైన పన్ను ఉంటుంది.

నిజం చెప్పాలంటే ప్రస్తుతం మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానం ఒక తీరులో లేదు. వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలుపెడితే దాని విక్రేతలు, చిల్లర వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకూ అన్ని దశల్లో పన్నులున్నాయి. పైపెచ్చు రాష్ట్రానికి, రాష్ట్రానికీ  మధ్య వీటి విలువలు మారుతున్నాయి కూడా. పన్ను మీద పన్ను విధిస్తుండటంతో వస్తువుల ధరలు  పెరగటమే కాక... కొన్నిచోట్ల తక్కువ ధరకు, మరికొన్ని చోట్ల ఎక్కువ ధరకు దొరికే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పన్ను విధానాన్ని సంస్కరించి దేశమంతటా ఒకే పన్ను అమలయ్యేలా చూడటానికి తెస్తున్న విధానమే... ‘జీఎస్‌టీ’!. రాజ్యాంగంలో 122వ సవరణ ద్వారా దీన్ని చేర్చారు.

జీఎస్టీ అవసరమేంటి?
ఏ వస్తువు తయారీకైనా ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకులు కొనేటపుడు తయారీదార్లు వాటికి పన్నులు కడతారు. తీరా వస్తువు తయారు చేసి విక్రయించేటప్పుడు కూడా మళ్లీ పన్ను కడతారు. పైగా రాష్ట్రానికి, రాష్ట్రానికీ పన్ను రేట్లు మారుతుంటాయి కూడా. ఈ పరోక్ష పన్నులన్నీ కలిసి చివరికి వినియోగదారుడికి చేరేసరికి సుమారు 28–30 శాతం వరకూ అవుతున్నాయి.  అందుకే మన దేశంలో వస్తువుల ధరలు ఎక్కువగా ఉండి... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల హవాకు కారణమవుతున్నాయి. దీన్ని సంస్కరించి జీఎస్‌టీని అమల్లోకి తెస్తే పన్నుల భారం కొంతయినా తగ్గి వస్తువు ధరలు దిగొస్తాయని, అప్పుడు దేశంలో ఉత్పత్తయ్యే వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులతో ధరలో కూడా పోటీ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లోనూ మన వస్తువుల గిరాకీ పెరుగుతుందని అంచనా.

జీఎస్‌టీని ఎవరు చెల్లించాలి?
ప్రస్తుతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న వారంతా ఇకపై జీఎస్‌టీ పరిధిలోకే వస్తారు. వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అంతా జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. అంతిమంగా మాత్రం ఈ పన్నుల భారాన్ని మోయాల్సింది కొనుగోలుదారులే.

జీఎస్‌టీని ఎవరు నిర్వహిస్తారు?
జీఎస్‌టీ డేటాబేస్‌ నిర్వహణ, సేవల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌) అనే సంస్థ ఏర్పాటయింది. దీన్లో కేంద్రానికి, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు కలిపి తలా 24.5 శాతం చొప్పున 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. లాభాపేక్ష లేని ఈ ప్రైవేటు సంస్థ... ప్రస్తుతం ఆదాయపు పన్ను, పరోక్ష పన్నులను నిర్వహిస్తున్న ట్యాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ (టీఐఎన్‌) మాదిరిగానే పనిచేస్తుంది. అయితే జీఎస్‌టీఎన్‌లో పన్ను, రిటర్న్‌ల వంటివన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఏదీ కూడా భౌతికంగా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడ రిటర్న్‌లో తప్పులు దొర్లినా, జీఎస్‌టీ నంబర్లతో రిటర్న్‌లు సరిపోలకపోయినా ఇట్టే తెలిసిపోతుంది.

జీఎస్‌టీ ఎన్ని రకాలంటే...
1. సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ)
కేంద్ర పరిధిలోని సెంట్రల్‌ ఎక్సైజ్, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్‌ ట్యాక్స్, సర్‌చార్జి, కౌంటర్‌ వీలింగ్‌ డ్యూటీ వంటివి సీజీఎస్‌టీలో విలీనమవుతాయి.
2. స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ)
రాష్ట్ర పరిధిలోని వ్యాట్, అమ్మకం పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోదపు పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, ల్యాటరీ, బెట్టింగ్‌లపై విధించే పన్నుల వంటివి ఎస్‌జీఎస్‌టీలో విలీనమవుతాయి.
3. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ)
ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు రెండు రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్‌టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్‌టీ పరిధిలోకే వస్తాయి


జీఎస్‌టీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
(రేపటి సాక్షి బిజినెస్‌లో)


జీఎస్‌టీ నెట్‌వర్క్‌లో నమోదు చేసుకోవటమెలా?
(పూర్తి వివరాల కోసం www.sakshibusiness.com చూడండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement