SGST
-
దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: నవంబర్ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. వరుసగా ఐదో నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. 2021 నవంబరులో వసూలైన జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఆదాయం రూ.1,31,526 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ - రూ.23,978 కోట్లు, స్టేట్ జీఎస్టీ - రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ - రూ.66,815 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1,39,708 కోట్లు వచ్చాయి. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.66,815 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,165 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.9,606 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.రూ.653 కోట్లతో సహా) . గత ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే నవంబర్ 2021లో సేకరించిన జీఎస్టీ ఆదాయం 25 శాతం పెరిగింది. 2019-20తో పోలిస్తే కంటే 27 శాతం పెరిగింది. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,273 కోట్లు, రాష్ట్రాలతో 22,655 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ. 51,251 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.53,782 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 43 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్ 3న జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం రూ.17,000 కోట్లు విడుదల చేసింది. (చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!) -
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు!
-
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ. ఈ ఏడాదిలో వరుసగా నాలుగో నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఈ జీఎస్టీ వసూళ్లలో కేంద్ర వాటా రూ.23,861 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు, సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,998 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.699 కోట్లతో సహా). ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉన్నాయి. చిప్ కొరత వల్ల కార్లు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ప్రభావితం కాకపోతే ఇంకా ఆదాయం ఎక్కువగా వచ్చి ఉండేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: ఇండియన్ బ్యాంకులో రూ.266 కోట్ల మోసం!) -
ఐదవ నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టి వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదవ నెలలో కూడా జీఎస్టి వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టి వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.13 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 7 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,13,143 కోట్లు కాగా గత నెలలో వసూలు చేసిన రూ.1,19,875 కోట్ల రూపాయల కన్నా తక్కువ. ఫిబ్రవరి నెలకు గాను వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,092 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.55,253 కోట్లు, సెస్సులు కింద రూ.9,525 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు దాటాయని, జీఎస్టీ వసూళ్లు తిరిగి పుంజుకున్నాయనడానికి ఇదే నిదర్శమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవిన్ 2.0 రెడీ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా! వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్ -
మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597కోట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపించింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలైంది. ఇందులో.. రూ.19,183 కోట్లు సీజీఎస్టీ కింద, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ కింద, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్సు రూపంలో వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 లక్షల జీఎస్టీ రిటర్నులు నమోదు కాగా, మార్చిలో 76.5 లక్షలకు తగ్గాయి. -
ఎవరి వాటా ఎంత?
జీఎస్టీలో 50 శాతం వాటా కేంద్రానికే ► ఐజీఎస్టీలో సగం, సీజీఎస్టీ మొత్తం కేంద్ర ఖజానాకు ► డీలర్ టు డీలర్ అమ్మకాలపై ప్రతి ఇన్వాయిస్ అప్లోడ్ చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్ : దిలీప్ ఓ హోటల్‌కు వెళ్లి తనకు కావాల్సినవి తినగా రూ.500 బిల్లు అయింది. అందులో ఎస్జీఎస్టీ కింద రూ.45, సీజీఎస్టీ కింద రూ.45 కలిపి మొత్తం 590 రూపాయలను హోటల్ యాజమాన్యం వసూలు చేసింది. అయితే జీఎస్టీతో దేశమంతా ఒకటే పన్ను కదా.. మరి హోటల్ ఇచ్చిన పన్నులో రెండు జీఎస్టీలున్నాయేంటనేది దిలీప్ సందేహం. రెండు జీఎస్టీలను హోటల్ బిల్లులో పేర్కొన డంలో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే జీఎస్టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకుంటాయి. అందులో సీజీఎస్టీ కేంద్రానికి వెళుతుంది. ఎస్జీఎస్టీ రాష్ట్రానికి వస్తుంది. రెండూ కలిపితేనే అసలు జీఎస్టీ. అందుకే మనం ఏ వస్తువు కొన్నా అది ఏ శ్లాబ్‌లో ఉంటే అందులో సగం సీజీఎస్టీ కింద, సగం ఎస్జీఎస్టీ కింద వసూ లు చేస్తారు. అంతేకానీ మొత్తం పన్నును రెండు సార్లు వసూలు చేయడం కాదు. వీటికి తోడు బిల్లులో గతంలో ఉన్న 7 శాతం సర్వీస్ ట్యాక్స్ కలిపితేనే ఆ హోటల్ తప్పు చేసినట్లు. రాష్ట్రంలోని లావాదేవీల్లోనూ అంతే.. రెండు రాష్ట్రాల మధ్య జరిగే పన్ను లావాదేవీల వ్యవహారం అలా ఉంటే.. ఒకే రాష్ట్రంలో జరిగే లావాదేవీలపై కట్టే పన్నును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం పంచుకుంటాయి. అంటే లావాదేవీ ఎక్కడ జరిగినా, ఏ వస్తువుపై పన్ను వచ్చినా అందులో సగం కేంద్రానికి వెళ్తుందన్న మాట. రాష్ట్రాంతర లావాదేవీల్లో డీలర్ కట్టే పన్ను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ రణకు ఓ డీలర్ రూ.లక్ష పన్ను చెల్లిస్తే అందులో రూ.50 వేలు నేరుగా కేంద్ర ఖజానాకు, రూ.50 వేలు రాష్ట్ర ఖజానాకు వస్తుంది. అయితే, డీలర్ మాత్రం ఒకేసారి కడతాడన్నమాట. కాగా, ఐజీఎస్టీకి సంబంధించిన పన్నును ఐజీఎస్టీ బోర్డు రాష్ట్రానికి, కేంద్రానికి పంపిణీ చేస్తే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీలు మాత్రం నేరుగా ఆయా ప్రభుత్వాల ఖజానాకు వెళుతుంది. ఇందుకోసం జీఎస్టీలో రిజిస్టర్ చేసుకునే సమయంలో ప్రతి డీలర్ 11 వరకు బ్యాంకు అకౌంట్ నంబర్లను ఇవ్వొచ్చు. అయితే, ఏ వస్తువుపై పన్ను కడుతున్నాడో ఆ వస్తువు అమ్మకానికి సంబంధించిన ఇన్వాయిస్లో పేర్కొనే బ్యాంకు ఖాతా ద్వారానే పన్ను చెల్లించాలి. కాగా, డీలర్లు ప్రతి వ్యాపార లావా దేవీలకు సంబంధించిన ఇన్వాయిస్లను జీఎస్టీ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిన పనిలేదని జీఎస్టీ చట్టం చెబుతోంది. డీలర్ టు డీలర్‌కు జరిగే లావాదేవీలను పూర్తిగా అప్లోడ్ చేయాల్సి ఉండగా, డీలర్‌కు వినియోగదారుడికి మధ్య జరిగే లావాదేవీల ప్రతి ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాల్సిన అవసరంలేదు. అయితే, ఈ లావాదేవీ రూ.2.5 లక్షలకు మించితే మాత్రం సదరు ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా పంచుకుంటారంటే.. పన్ను వసూలు అలా ఉంటే.. ఈ పన్నును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పంచుకుంటా యి? పన్నును వసూలు చేసే డీలర్ రెండింటికీ రెండు సార్లు పన్ను కట్టాలా? ఒకసారి కడితే సరిపోతుందా? అనే సందేహాలు కూడా వ్యాపార వర్గాల్లో ఉన్నాయి.వాస్తవానికి జీఎస్టీని మూడుగా విభజించారు. అందులో మొదటిది సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ). దీన్ని రెండు రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీని పన్నును డీలర్ కట్టినప్పుడు అది నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న ఐజీఎస్టీ బోర్డు ఆ పన్ను కట్టిన వస్తువు ఏ రాష్ట్రంలో వినియోగం జరిగిందన్న దాన్ని పరిశీలించి ఆ రాష్ట్రానికి 50 శాతం పంపి, 50 శాతం తన ఖజానాలో ఉంచుకుంటుంది. అంటే అంతర్రాష్ట్ర లావాదేవీల్లో వచ్చే పన్ను రాబడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరి సగం అన్నమాట. -
గెట్.. సెట్..జీఎస్టీ!
♦ జూలై 1 నుంచీ దేశమంతా ఒకటే పన్ను ♦ కేంద్ర, రాష్ట్రాల్లోని కీలక పన్నులన్నీ దీన్లో విలీనం ♦ సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీగా విభజన ♦ వ్యాపారస్తుల నమోదుకు... జీఎస్టీఎన్ (సాక్షి, బిజినెస్ విభాగం) గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ముద్దుగా జీఎస్టీ. దీర్ఘకాల తర్జనభర్జనల అనంతరం పార్లమెంటుతో పాటు దేశంలోని రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆమోదించటంతో... జూలై 1 నుంచి దీన్ని అమల్లోకి తేవటానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సరే! అంతవరకూ బాగానే ఉంది. అసలీ జీఎస్టీ అంటే ఏంటి? దీన్నెందుకు తెస్తున్నారు? దీన్ని అమలు చేసేదెలా? ఇపుడున్న ఇన్ని పన్నుల స్థానంలో ఒకే పన్నును అమలు చేయటం ఈజీయేనా? వ్యాపారులంతా దాన్లో చేరేదెలా? అసలింతకీ జీఎస్టీ వస్తేగిస్తే మనకేంటి లాభం? ధరలేమైనా తగ్గుతాయా... లేక పెరగబోతున్నాయా? ఏఏ వస్తువుల ధరలు ఎలా ఉంటాయి? ఏఏ సేవల ధరల్లో మార్పులు రాబోతున్నాయి? రాయితీలపై కంపెనీలు పెట్టిన యాజమాన్యాలకు ఇపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని చెబుతాయి? జీఎస్టీ వచ్చాక కూడా పన్ను రాయితీలివ్వటం సాధ్యమేనా? ఇవన్నీ చాలామందికి వస్తున్న సందేహాలు. వీటిని నివృత్తి చేయటానికి పలువురు నిపుణులను సంప్రదించి వారి సాయంతో ‘సాక్షి’ బిజినెస్ విభాగం ఈ వరస కథనాలను అందిస్తోంది. ‘‘జీఎస్టీ... పన్నుల పెద్దన్న’’ శీర్షికన అందిస్తున్న ఈ కథనాలు వరసగా మీ కోసం... జీఎస్టీ. వస్తువుల తయారీ, సరఫరా లేదా సేవలపై విధిస్తారు కాబట్టే దీన్ని వస్తు, సేవల పన్నుగా పిలుస్తున్నారు. వివిధ రకాల పన్నుల స్థానంలో దేశమంతా ఒకటే పన్ను విధానాన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం చేస్తున్న కీలక ప్రయత్నమే ఈ జీఎస్టీ. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌తో పాటు కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జిలు, సెస్సులు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్, ప్రవేశ పన్ను/ఆక్ట్రాయ్ వంటి 17 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే అమల్లోకి వస్తుంది. దీంతో దేశమంతటా ఒక వస్తువు లేదా సర్వీసుపై ఒకే రకమైన పన్ను ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానం ఒక తీరులో లేదు. వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలుపెడితే దాని విక్రేతలు, చిల్లర వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకూ అన్ని దశల్లో పన్నులున్నాయి. పైపెచ్చు రాష్ట్రానికి, రాష్ట్రానికీ మధ్య వీటి విలువలు మారుతున్నాయి కూడా. పన్ను మీద పన్ను విధిస్తుండటంతో వస్తువుల ధరలు పెరగటమే కాక... కొన్నిచోట్ల తక్కువ ధరకు, మరికొన్ని చోట్ల ఎక్కువ ధరకు దొరికే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పన్ను విధానాన్ని సంస్కరించి దేశమంతటా ఒకే పన్ను అమలయ్యేలా చూడటానికి తెస్తున్న విధానమే... ‘జీఎస్టీ’!. రాజ్యాంగంలో 122వ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. జీఎస్టీ అవసరమేంటి? ఏ వస్తువు తయారీకైనా ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకులు కొనేటపుడు తయారీదార్లు వాటికి పన్నులు కడతారు. తీరా వస్తువు తయారు చేసి విక్రయించేటప్పుడు కూడా మళ్లీ పన్ను కడతారు. పైగా రాష్ట్రానికి, రాష్ట్రానికీ పన్ను రేట్లు మారుతుంటాయి కూడా. ఈ పరోక్ష పన్నులన్నీ కలిసి చివరికి వినియోగదారుడికి చేరేసరికి సుమారు 28–30 శాతం వరకూ అవుతున్నాయి. అందుకే మన దేశంలో వస్తువుల ధరలు ఎక్కువగా ఉండి... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల హవాకు కారణమవుతున్నాయి. దీన్ని సంస్కరించి జీఎస్టీని అమల్లోకి తెస్తే పన్నుల భారం కొంతయినా తగ్గి వస్తువు ధరలు దిగొస్తాయని, అప్పుడు దేశంలో ఉత్పత్తయ్యే వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులతో ధరలో కూడా పోటీ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లోనూ మన వస్తువుల గిరాకీ పెరుగుతుందని అంచనా. జీఎస్టీని ఎవరు చెల్లించాలి? ప్రస్తుతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న వారంతా ఇకపై జీఎస్టీ పరిధిలోకే వస్తారు. వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అంతా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అంతిమంగా మాత్రం ఈ పన్నుల భారాన్ని మోయాల్సింది కొనుగోలుదారులే. జీఎస్టీని ఎవరు నిర్వహిస్తారు? జీఎస్టీ డేటాబేస్ నిర్వహణ, సేవల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) అనే సంస్థ ఏర్పాటయింది. దీన్లో కేంద్రానికి, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు కలిపి తలా 24.5 శాతం చొప్పున 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. లాభాపేక్ష లేని ఈ ప్రైవేటు సంస్థ... ప్రస్తుతం ఆదాయపు పన్ను, పరోక్ష పన్నులను నిర్వహిస్తున్న ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ (టీఐఎన్) మాదిరిగానే పనిచేస్తుంది. అయితే జీఎస్టీఎన్లో పన్ను, రిటర్న్‌ల వంటివన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఏదీ కూడా భౌతికంగా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడ రిటర్న్‌లో తప్పులు దొర్లినా, జీఎస్టీ నంబర్లతో రిటర్న్‌లు సరిపోలకపోయినా ఇట్టే తెలిసిపోతుంది. జీఎస్టీ ఎన్ని రకాలంటే... 1. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్‌చార్జి, కౌంటర్ వీలింగ్ డ్యూటీ వంటివి సీజీఎస్టీలో విలీనమవుతాయి. 2. స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రాష్ట్ర పరిధిలోని వ్యాట్, అమ్మకం పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోదపు పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, ల్యాటరీ, బెట్టింగ్‌లపై విధించే పన్నుల వంటివి ఎస్జీఎస్టీలో విలీనమవుతాయి. 3. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు రెండు రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్టీ పరిధిలోకే వస్తాయి జీఎస్టీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? (రేపటి సాక్షి బిజినెస్‌లో) జీఎస్టీ నెట్‌వర్క్‌లో నమోదు చేసుకోవటమెలా? (పూర్తి వివరాల కోసం www.sakshibusiness.com చూడండి) -
ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీ లకు ఆమోదం
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో కేంద్రం దాదాపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ చట్టంలోని మరో కీలకమైన ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కౌన్సిల్ 12వ సమావేశంలో ఈ మేరకు ఈ చట్టాలను ఆమోదించింది. జూ సెంట్రల్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) గరిష్ట పన్ను 20శాతంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి (సీజీఎస్టీ) గరిష్ట పన్ను 40శాతంగా, సగటు 28శాతంగా కౌన్సిల్ నిర్ణయించింది. ఈ అయిదు చట్టాల ఆమోదం తర్వాత జూలై 1న జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వీటిని కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నామని ఆయన మీడియాకు తెలిపారు. అలాగే ఎస్జీఎస్టీ ని ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉందని ఆయన చెప్పారు. లగ్జరీ వస్తువులపై పన్నును 15 శాతంగా నిర్ణయించినట్టు చెప్పారు. బొగ్గుపై టన్నుకు రూ.400గా , పాన్ మసాలా రూ. 135శాతం, సిగరెట్లపై 290 శాతం పన్ను నిర్ణయించగా, బీడీలపై పన్నును ఇంకా నిర్ణయించాల్సి ఉందని తెలిపారు. మరో నాలుగు అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ మొదటివారంలో జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్టు జైట్లీ వివరించారు. పన్ను స్లాబ్‌లపై మార్చి 31 సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. బార్లు, రెస్టారెంట్లు, పాన్ మసాలాలు, లగ్జరీ కార్లు ప్యాకేజ్డ్ ఫుడ్ లాంటి డీమెరిట్ గూడ్స్ ప్రియం కానుండగా, ఫ్రిజ్‌లు, సబ్బులు, తల నూనెలు , టూత్ పేస్ట్ ల ధరలు చవక కానున్నాయి. అయితే అత్యవసర ధరలు యథాతథంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు సినిమాలపై విధించే ఎంటర్టైన్ మెంట్ టొబాకో, బీడీ ఉత్పత్తులపై విధించే పన్నులపై చర్చలు జరిగాయనీ, సెజ్ టాక్సేషన్ పై కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిగినట్టు మనీష్ సిసోడియా మీడియాకు తెలిపారు. కాగా సీజీ, ఐజీ, కాంపన్సేషన్ జీఎస్టీ చట్టాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఫిట్మెంట్ రేట్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. -
త్వరలో ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీ చట్టాలు రాష్ట్రాలకు
ముంబై: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణజైట్లీ మీడియాకు వివరించారు. ఒకే దేశం ఒక పన్ను చట్టం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులో మరో కీలక అంకం ముగిసినట్టు చెప్పారు. జీఎస్టీ చట్టంలో అమలులో మొత్తం 5 ( కాంపన్సేషన్ లా, సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీ) చట్టాలను ఆమోదించాల్సి ఉందనీ. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 10 వ సమావేశంలో ఇప్పటికే కాంపన్సేషన్ లా చట్టాన్ని అమోదించినట్టు చెప్పారు. తాజాగా మరో రెండు చట్టాలు సీజీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలను అమోదించినట్టుచెప్పారు. వీటిపై ముంబైలో శనివారం జరిగిన సమావేశంలో విస్తృతమైన చర్చ జరిగిన అనతరం కౌన్సిల్ వీటికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఫార్మల్ ఆమోదం లభించినట్టు మీడియాకు తెలిపారు. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇంకా రెండు ప్రధానమైన ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీ చట్టాలను రాష్ట్రాల్లో ఆమోదించాలన్నారు. ఈ ఆమోదానికి ముందు జీఎస్టీ చట్టాలు ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీ ప్రతిపాదనలను మూడు రోజుల్లో లీగల్ కమిటీ ఫైనల్ చేయనుందని జైట్లీ చెప్పారు.అనంతరం వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఢిల్లీ, పుదుచ్చేరి సహా అన్ని రాష్ట్రాలకు వీటిని పంపిస్తామని చెప్పారు. అలాగే మార్చి 15-16న ఢిల్లీలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఫిట్మెంట్ రేట్లపై తుది నిర్ణయం ఉంటుందని అరుణ్ జైట్టీ స్పష్టం చేశారు. అనంతరం వీటిని మార్చి 9 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (ద్వితీయార్థంలో)ముందు ఉంచనున్నట్టు జైట్లీ చెప్పారు