IGST
-
గూగుల్, మెటా,ఎక్స్‌కు భారత్ భారీ షాక్!
మెటా,ఎక్స్, గూగుల్ సంస్థలకు భారత్ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో ఆయా సంస్థల నుంచి 18 శాతం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ విభాగం ఐజీఎస్టీ నుంచి ఓఐడీఏఆర్ సంస్థలకు ఇకపై మినహాయింపు ఇవ్వబోదని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అడ్వటైజింగ్, క్లౌడ్ సర్వీస్, మ్యూజిక్, సబ్స్క్రిప్షన్ సర్వీసులు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సేవలందిస్తున్న ఆయా కంపెనీలు నుంచి ఐజీఎస్టీని వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందంటూ ఈ అంశంలో ప్రమేయం ఉన్న ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం, ఓఐడీఏఆర్ సంస్థలు ఎలాంటి ట్యాక్స్ చెల్లించే పనిలేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు పన్ను నుంచి మినహాయింపులు ఇస్తున్నాయి. కేవలం, బిజినెస్ టూ బిజినెస్ సర్వీస్‌లు అందించే కంపెనీలు మాత్రమే ట్యాక్స్‌లు చెల్లిస్తున్నాయి. తాజాగా పన్నుల విభాగం తీసుకున్న నిర్ణయంతో ఓఐడీఏఆర్ సంస్థలైన మెటా,ఎక్స్, గూగుల్ వంటి సంస్థల మీద పన్ను భారం పడనుంది. ఓడీఐఆర్ అంటే ఏమిటి? ఓడీఐఆర్ ని ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్ అని పిలుస్తారు. ఈ విభాగంలో సేవలందించే సంస్థలు వ్యక్తులు లేదంటే కస్టమర్లుతో ఎలాంటి భౌతిక సంబంధం ఉండదు. ఆన్లైన్ ద్వారా వినియోగదారుల అవసరాల్ని తీర్చుతాయి. గూగుల్,మెటా,ఎక్స్ తో పాటు ఆన్లైన్ ద్వారా కస్టమర్ల అవసరాల్ని తీర్చే కంపెనీలు ఈ ఓఐడీఐఆర్ విభాగం కిందకే వస్తాయి. -
దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: నవంబర్ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. వరుసగా ఐదో నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. 2021 నవంబరులో వసూలైన జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఆదాయం రూ.1,31,526 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ - రూ.23,978 కోట్లు, స్టేట్ జీఎస్టీ - రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ - రూ.66,815 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1,39,708 కోట్లు వచ్చాయి. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.66,815 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,165 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.9,606 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.రూ.653 కోట్లతో సహా) . గత ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే నవంబర్ 2021లో సేకరించిన జీఎస్టీ ఆదాయం 25 శాతం పెరిగింది. 2019-20తో పోలిస్తే కంటే 27 శాతం పెరిగింది. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,273 కోట్లు, రాష్ట్రాలతో 22,655 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ. 51,251 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.53,782 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 43 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్ 3న జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం రూ.17,000 కోట్లు విడుదల చేసింది. (చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!) -
ఐదవ నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టి వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదవ నెలలో కూడా జీఎస్టి వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టి వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.13 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 7 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,13,143 కోట్లు కాగా గత నెలలో వసూలు చేసిన రూ.1,19,875 కోట్ల రూపాయల కన్నా తక్కువ. ఫిబ్రవరి నెలకు గాను వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,092 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.55,253 కోట్లు, సెస్సులు కింద రూ.9,525 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు దాటాయని, జీఎస్టీ వసూళ్లు తిరిగి పుంజుకున్నాయనడానికి ఇదే నిదర్శమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవిన్ 2.0 రెడీ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా! వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్ -
రూ. 2,638 కోట్ల ఐజీఎస్టీ నిధులు వెంటనే ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రూ.2,638 కోట్లు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. గురువారం ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన వాటాల గణాంకాలు ఆయన ప్రస్తావించారు. ఐజీఎస్టీ సొమ్ముతో పాటు సెటిల్మెంట్ బేస్డ్ యాన్యువల్ రిటర్న్స్ కింద మరో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీపై ఎలాంటి అభ్యంతరాలూ లేవని, ఏ రాష్ట్రానికి ఎంత రావాల్సి ఉందనేదానిపైనా స్పష్టత ఉందన్నారు. దీని ప్రకారం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రూ.25,058 కోట్ల ఐజీఎస్టీ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫారసు చేయాలని కోరారు. గతంలో ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా జమ చేశారని ‘కాగ్’ఎత్తి చూపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కాబట్టి ఎలాంటి చర్చా లేకుండా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలని ఈ నెల 5న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసు చేయాలని కోరారు. దీనికి ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కన్వీనర్, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ అంగీకరించారు. రాష్ట్రాలకు ఐజీఎస్టీ మొత్తం ఇవ్వాలనే సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 2018–19లో రూ.13,944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయడాన్ని కాగ్ తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఆయన తెలంగాణకు రూ.210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. -
2,641 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు రూ.2,641 కోట్లను వెంటనే ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. కరోనా మిగిల్చిన ఆర్థిక కష్టాలను పూడ్చుకునేందుకు ఈ నిధులు ఎంతో అవసరమని, వచ్చే నెల 5న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు చెల్లించాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలన్నారు. మంగళవారం బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ అధ్యక్షతన జరిగిన ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశానికి బీఆర్కేఆర్ భవన్ నుంచి మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ మొత్తం రూ.2,641 కోట్లు కాగా, జీఎస్టీ కౌన్సిల్ మాత్రం రూ.3 కోట్లు తగ్గించి చెబుతోందని, ఈ లెక్కలపై ఎలాంటి సమస్య లేదని, అయితే ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా రాష్ట్రాలకు చెల్లించాలని గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ తరఫున సిఫార్సు చేయాలని మోదీని కోరారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే మరో 3 నెలలు ఆగాల్సి వస్తుందని చెప్పారు. హరీశ్ ప్రతిపాదనపై స్పందించిన సుశీల్ మోదీ అక్టోబర్ 1న మరో మారు ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తెలం గాణతో పాటు మరో 16 రాష్ట్రాలకు 2018 నుంచి ఐజీఎస్టీ బకాయిలు ఉన్నాయని, 8 రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులను కన్సాలిడేట్ ఫండ్ నుంచి చెల్లింపులు చేసే సమయంలో సర్దుబాటు చేయాలని హరీశ్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి హరీశ్‌తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597కోట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపించింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలైంది. ఇందులో.. రూ.19,183 కోట్లు సీజీఎస్టీ కింద, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ కింద, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్సు రూపంలో వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 లక్షల జీఎస్టీ రిటర్నులు నమోదు కాగా, మార్చిలో 76.5 లక్షలకు తగ్గాయి. -
సేవా భోజ్ యోజన పథకం: జీఎస్టీ రిఫండ్
-
అన్నదానం చేస్తే జీఎస్టీ రిఫండ్
న్యూఢిల్లీ: అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సేవా భోజ్ యోజన’గా పిలిచే ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని అమలుచేయనుంది. కనీసం ఐదేళ్లుగా పనిచేస్తూ నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు తదితరాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హమైన సంస్థలు సాంస్కృతిక శాఖ వద్ద నమోదుచేసుకోవాలి. దర్పన్ పోర్టల్‌లో సమర్పించే దరఖాస్తులను సాంస్కృతిక శాఖ నియమించిన కమిటీ పరిశీలించి 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటుంది. వాటి పనితీరుపై సంతృప్తి చెందితే గడువు ముగిశాక రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరిస్తారు. పాలక మండలి సభ్యులు, ధర్మకర్తలు, చైర్మన్లలో ఎవరైనా వైదొలగినా, కొత్తవారు నియమితులైన సంగతిని, అన్నదానం చేస్తున్న ప్రాంతాలలో మార్పు తదితర సమాచారాన్ని సాంస్కృతిక శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుంది. -
గెట్.. సెట్..జీఎస్టీ!
♦ జూలై 1 నుంచీ దేశమంతా ఒకటే పన్ను ♦ కేంద్ర, రాష్ట్రాల్లోని కీలక పన్నులన్నీ దీన్లో విలీనం ♦ సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీగా విభజన ♦ వ్యాపారస్తుల నమోదుకు... జీఎస్టీఎన్ (సాక్షి, బిజినెస్ విభాగం) గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ముద్దుగా జీఎస్టీ. దీర్ఘకాల తర్జనభర్జనల అనంతరం పార్లమెంటుతో పాటు దేశంలోని రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆమోదించటంతో... జూలై 1 నుంచి దీన్ని అమల్లోకి తేవటానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సరే! అంతవరకూ బాగానే ఉంది. అసలీ జీఎస్టీ అంటే ఏంటి? దీన్నెందుకు తెస్తున్నారు? దీన్ని అమలు చేసేదెలా? ఇపుడున్న ఇన్ని పన్నుల స్థానంలో ఒకే పన్నును అమలు చేయటం ఈజీయేనా? వ్యాపారులంతా దాన్లో చేరేదెలా? అసలింతకీ జీఎస్టీ వస్తేగిస్తే మనకేంటి లాభం? ధరలేమైనా తగ్గుతాయా... లేక పెరగబోతున్నాయా? ఏఏ వస్తువుల ధరలు ఎలా ఉంటాయి? ఏఏ సేవల ధరల్లో మార్పులు రాబోతున్నాయి? రాయితీలపై కంపెనీలు పెట్టిన యాజమాన్యాలకు ఇపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని చెబుతాయి? జీఎస్టీ వచ్చాక కూడా పన్ను రాయితీలివ్వటం సాధ్యమేనా? ఇవన్నీ చాలామందికి వస్తున్న సందేహాలు. వీటిని నివృత్తి చేయటానికి పలువురు నిపుణులను సంప్రదించి వారి సాయంతో ‘సాక్షి’ బిజినెస్ విభాగం ఈ వరస కథనాలను అందిస్తోంది. ‘‘జీఎస్టీ... పన్నుల పెద్దన్న’’ శీర్షికన అందిస్తున్న ఈ కథనాలు వరసగా మీ కోసం... జీఎస్టీ. వస్తువుల తయారీ, సరఫరా లేదా సేవలపై విధిస్తారు కాబట్టే దీన్ని వస్తు, సేవల పన్నుగా పిలుస్తున్నారు. వివిధ రకాల పన్నుల స్థానంలో దేశమంతా ఒకటే పన్ను విధానాన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం చేస్తున్న కీలక ప్రయత్నమే ఈ జీఎస్టీ. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌తో పాటు కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జిలు, సెస్సులు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్, ప్రవేశ పన్ను/ఆక్ట్రాయ్ వంటి 17 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే అమల్లోకి వస్తుంది. దీంతో దేశమంతటా ఒక వస్తువు లేదా సర్వీసుపై ఒకే రకమైన పన్ను ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానం ఒక తీరులో లేదు. వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలుపెడితే దాని విక్రేతలు, చిల్లర వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకూ అన్ని దశల్లో పన్నులున్నాయి. పైపెచ్చు రాష్ట్రానికి, రాష్ట్రానికీ మధ్య వీటి విలువలు మారుతున్నాయి కూడా. పన్ను మీద పన్ను విధిస్తుండటంతో వస్తువుల ధరలు పెరగటమే కాక... కొన్నిచోట్ల తక్కువ ధరకు, మరికొన్ని చోట్ల ఎక్కువ ధరకు దొరికే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పన్ను విధానాన్ని సంస్కరించి దేశమంతటా ఒకే పన్ను అమలయ్యేలా చూడటానికి తెస్తున్న విధానమే... ‘జీఎస్టీ’!. రాజ్యాంగంలో 122వ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. జీఎస్టీ అవసరమేంటి? ఏ వస్తువు తయారీకైనా ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకులు కొనేటపుడు తయారీదార్లు వాటికి పన్నులు కడతారు. తీరా వస్తువు తయారు చేసి విక్రయించేటప్పుడు కూడా మళ్లీ పన్ను కడతారు. పైగా రాష్ట్రానికి, రాష్ట్రానికీ పన్ను రేట్లు మారుతుంటాయి కూడా. ఈ పరోక్ష పన్నులన్నీ కలిసి చివరికి వినియోగదారుడికి చేరేసరికి సుమారు 28–30 శాతం వరకూ అవుతున్నాయి. అందుకే మన దేశంలో వస్తువుల ధరలు ఎక్కువగా ఉండి... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల హవాకు కారణమవుతున్నాయి. దీన్ని సంస్కరించి జీఎస్టీని అమల్లోకి తెస్తే పన్నుల భారం కొంతయినా తగ్గి వస్తువు ధరలు దిగొస్తాయని, అప్పుడు దేశంలో ఉత్పత్తయ్యే వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులతో ధరలో కూడా పోటీ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లోనూ మన వస్తువుల గిరాకీ పెరుగుతుందని అంచనా. జీఎస్టీని ఎవరు చెల్లించాలి? ప్రస్తుతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న వారంతా ఇకపై జీఎస్టీ పరిధిలోకే వస్తారు. వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అంతా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అంతిమంగా మాత్రం ఈ పన్నుల భారాన్ని మోయాల్సింది కొనుగోలుదారులే. జీఎస్టీని ఎవరు నిర్వహిస్తారు? జీఎస్టీ డేటాబేస్ నిర్వహణ, సేవల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) అనే సంస్థ ఏర్పాటయింది. దీన్లో కేంద్రానికి, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు కలిపి తలా 24.5 శాతం చొప్పున 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. లాభాపేక్ష లేని ఈ ప్రైవేటు సంస్థ... ప్రస్తుతం ఆదాయపు పన్ను, పరోక్ష పన్నులను నిర్వహిస్తున్న ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ (టీఐఎన్) మాదిరిగానే పనిచేస్తుంది. అయితే జీఎస్టీఎన్లో పన్ను, రిటర్న్‌ల వంటివన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఏదీ కూడా భౌతికంగా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడ రిటర్న్‌లో తప్పులు దొర్లినా, జీఎస్టీ నంబర్లతో రిటర్న్‌లు సరిపోలకపోయినా ఇట్టే తెలిసిపోతుంది. జీఎస్టీ ఎన్ని రకాలంటే... 1. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్‌చార్జి, కౌంటర్ వీలింగ్ డ్యూటీ వంటివి సీజీఎస్టీలో విలీనమవుతాయి. 2. స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రాష్ట్ర పరిధిలోని వ్యాట్, అమ్మకం పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోదపు పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, ల్యాటరీ, బెట్టింగ్‌లపై విధించే పన్నుల వంటివి ఎస్జీఎస్టీలో విలీనమవుతాయి. 3. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు రెండు రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్టీ పరిధిలోకే వస్తాయి జీఎస్టీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? (రేపటి సాక్షి బిజినెస్‌లో) జీఎస్టీ నెట్‌వర్క్‌లో నమోదు చేసుకోవటమెలా? (పూర్తి వివరాల కోసం www.sakshibusiness.com చూడండి)