భారత్ కు ప్రైవేటు వినియోగం దన్ను
♦ 2016,2017లో వృద్ధి 7.5%
♦ ఐఎంఎఫ్ అంచనా
♦ చైనా, జపాన్‌లకు సవాళ్లు
సింగపూర్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2016, 2017లో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది. బలహీన ఎగుమతులు, రుణ వృద్ధి రేటు తక్కువగా ఉండడం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వినియోగ డిమాండ్ పటిష్టతే భారత్ వృద్ధికి కారణమవుతున్నట్లు తాజా ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ ఆర్థిక అవుట్‌లుక్‌లో పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు..
♦ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, గృహ ఆదాయాలు పెరగడం వంటి అంశాలు భారత్ వినియోగ డిమాండ్ పెరుగుదలకు కారణం.
♦ వస్తు సేవల పన్ను అమలుసహా విద్యుత్, మైనింగ్ వంటి రంగాల్లో వ్యవస్థాగత సంస్కరణల అమలును భారత్ వేగవంతం చేయాలి. భూమి, కార్మిక చట్టాల సంస్కరణలు సైతం వృద్ధి బాటలో కీలకం.
♦ బలహీన ఎగుమతులు, రుణ వృద్ధి లేకపోవడం, బ్యాంకుల బలహీన బ్యాలెన్స్ షీట్లు, కంపెనీల లాభాల అనిశ్చితి వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతున్నాయి.
♦ ప్రైవేటు పెట్టుబడుల్లో రికవరీ, మౌలిక రంగంలో ప్రభుత్వ భారీ పెట్టుబడుల అవకాశాలు వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడతాయి.
♦ ఆసియా పసిఫిక్ ప్రాంతం ప్రస్తుత, వచ్చే సంవత్సరాల్లో 5.3% వృద్ధిని సాధించవచ్చు.
♦ ఆసియాలో ప్రధానమైన చైనా, జపాన్ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లు కొనసాగుతాయి.
♦ 2015లో 6.9 శాతం వృద్ధి సాధించిన చైనా, 2016లో 6.5 శాతం వృద్ధి నమోదుచేసుకునే వీలుంది. 2017లో ఈ రేటు 6.2%కి తగ్గవచ్చు.
♦ జపాన్ వృద్ధి రేటు ఈ ఏడాది 0.5 శాతం, వచ్చే ఏడాది 0.1 శాతంగా నమోదయ్యే వీలుంది.
♦ ఆర్థిక సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఆసియా దేశాలకు ఉన్నాయి.