సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన మేర లేకపోవడంబీజేపీకి ఒకింత ఆందోళన కలిగిస్తున్న క్రమంలో రానున్న బడ్జెట్‌పై దీని ప్రభావం ఉండనుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోదీ సర్కార్ మారుతున్న ప్రాధాన్యతలకు అద్దం పట్టేలా ఉంటుందని భావిస్తున్నారు. గుజరాత్‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఎదురుగాలులు వీచిన క్రమంలో వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక రంగాలకు పెద్దపీట వేసేలా బడ్జెట్‌ను రూపొందించనున్నారు. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పీ)కు ఊతమిచ్చే చర్యలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
గుజరాత్‌లోని పలు జిల్లాల్లో ముందుకొచ్చిన రైతాంగ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి, పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడం గమనార్హం. గ్రామీణ భారతం, వ్యవసాయంపై అధిక నిధులు వెచ్చించడం జనాకర్షక పథకాలు కాదని, గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున వెచ్చించడం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో బడ్జెట్‌లో గ్రామీణ రంగానికి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తారని భావిస్తున్నారు.
మరోవైపు రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ చెప్పారు. కనీస మద్దతు ధరల అమలును పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రైతు రాబడిని రెట్టింపు చేయడం, ఉత్పాదకతను పెంచడం వంటి తమ లక్ష్యాల దిశగా దూకుడుగా ముందుకెళతామని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఆహారోత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధర ఇవ్వడంలో చొరవ చూపడం లేదని, ఆ రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి పెంచి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా రానున్న ఫిబ్రవరి బడ్జెటే పూర్తిస్ధాయి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలు, గ్రామీణ భారతానికి అత్యధిక కేటాయింపులు జరిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment