న్యూఢిల్లీ : మారిషస్ పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మార్కెట్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ ఒప్పందంపై దాదాపు మార్కెట్ విశ్లేషకులందరూ స్పందించారని, పెట్టుబడులు తగ్గే సూచనలున్నాయని వ్యక్తం చేశారన్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని ఆర్థికవ్యవస్థలో కల్లా భారత్ వృద్ధి రేటు క్రమేపీ పెరుగుతుందని, ఈ పెరుగుదల పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు.
భారత్ లో నేడు అమల్లో ఉన్న పన్నుల విధానం ఊహించదగినదేనని, ఈ విధానంలో పలు సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటును, ద్రవ్యోల్భణాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటూ... వాటి పెరుగుదలను నిరోధిస్తుందని దాస్ చెప్పారు. మొత్తాన్నికి భారత్ పెట్టుబడులు పెట్టడానికి ఒక ఆకర్షణీయమైన దేశంగా దాస్ అభివర్ణించారు.