ఒకే సంస్థ.. నాలుగు బ్రాండ్లు! | Havells India CMD Anil Rai Gupta special interview with sakshi | Sakshi
Sakshi News home page

ఒకే సంస్థ.. నాలుగు బ్రాండ్లు!

Published Tue, Apr 14 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

Havells India CMD Anil Rai Gupta special interview with sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూ : హావెల్స్ ఇండియా సీఎండీ అనిల్‌రాయ్ గుప్తా
 
హావెల్స్ ఇండియా సక్సెస్‌కు కారణమిదే
* గతేడాది రూ.8,000 కోట్ల టర్నోవర్
 
*  తెలంగాణ, ఏపీల్లో రూ.400 కోట్ల వ్యాపారం
* జూలైకల్లా మార్కెట్లోకి హావెల్స్ గీజర్లు

నిమ్రానా (రాజస్థాన్) నుంచి ఎ.శ్రీనాథ్ : ఒక కంపెనీ ఒకే బ్రాండ్‌ను తయారు చేస్తే కొనుగోలుదారులకు ఆప్షన్ ఉండదు.

ఒక షాప్‌కు వెళ్లినవారు ఆ బ్రాండ్‌ను కొనటం ఇష్టం లేకుంటే వేరే బ్రాండ్‌కు వెళ్లిపోతారు. అలాంటి వినియోగదారుల్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక మేం మా కంపెనీ నుంచే నాలుగు బ్రాండ్లను ఉత్పత్తి చేస్తున్నాం’’ ఇదీ ఎలక్ట్రిక్ ఉపకరణాల సంస్థ ‘హావెల్స్’ ఇండియా సీఎండీ అనిల్ రాయ్ గుప్తా మాట. కస్టమర్ ఏ బ్రాండ్‌ను ఎంచుకున్నా అది తమదై ఉండాలన్న ఉద్దేశంతోనే  హావెల్స్, క్రాబ్‌ట్రీ, స్టాండర్డ్, సైల్వానియా పేరిట నాలుగు బ్రాండ్ల ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

గృహ, వాణిజ్య సర్క్యూట్లు, కేబుల్స్, వైర్లు, మోటర్స్, ఫ్యాన్లు, స్విచ్చులు, పవర్ కెపాసిటర్లు, సీఎఫ్‌ఎల్ బల్బులు వంటి ఎలక్ట్రికల్ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్న హావెల్స్‌కు రాజస్థాన్‌లోని నిమ్రానాలో అత్యాధునిక ప్లాంటు ఉంది. శనివారం ఈ ప్లాంట్‌లో లూమినో ఎల్‌ఈడీ లైట్‌ను, ఈఎస్-40 ఫ్యాన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఆయనేమన్నారంటే..

 
బ్రాండ్ విలువ ముఖ్యం
దేశ, విదేశీ మార్కెట్లో పోటీని తట్టుకోవటానికి ఒక బ్రాండ్ సరిపోదు. ఒక్కసారి కస్టమర్లు బ్రాండ్‌కు అలవాటు పడితే వేరే ఎన్ని బ్రాండ్లొచ్చినా అటువైపు వెళ్లరు. ఉదాహరణకు థమ్సప్‌నే చూడండి. కోక్ దాన్ని కొనేశాక తమలో కలిపేసుకుంది. కానీ ఆ తరవాత కూడా చాలామంది కస్టమర్లు కోక్ బదులు థమ్సప్ కావాలని అడగటంతో చేసేదేమీ లేక కంపెనీ దేశీయ మార్కెట్లో థమ్సప్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. అందుకే మేం విడివిడి బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనూ బ్రాండింగ్ కోసం ఏటా రూ.300 కోట్లు ఖర్చుపెడుతున్నాం. ప్రస్తుతం హావెల్స్ ఇండియాకు 11 తయారీ ప్లాంట్లున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సైల్వానియా, దేశీయ మార్కెట్లో హావెల్స్, క్రాబ్‌ట్రీ, స్టాండర్డ్ ఉత్పత్తులు లభిస్తున్నాయి.
 
ఎల్‌ఈడీ, ఫ్యాన్ల మీదే దృష్టి..
ప్రస్తుతం ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లపై దృష్టి పెట్టాం. స్మార్ట్ సిటీలు, విద్యుత్ వినియోగం తక్కువగా ఉండటం వల్ల దేశంలో ఈ ఉత్పత్తుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది దేశంలో ఎల్‌ఈడీ లైట్ల మార్కెట్ రూ.850 కోట్లుగా ఉంది. ఏటా 45% వృద్ధి చెందుతోంది. వచ్చే రెండేళ్లలో ఎల్‌ఈడీ లైట్ల విభాగంలో మేం రూ.600 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫ్యాన్ల మార్కెట్ దేశంలో రూ.5,500 కోట్లుగా ఉంటే.. ఇందులో మా వాటా 14%. వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్ల వ్యాపారం లక్ష్యం గా పెట్టుకున్నాం. 2004లో మా టర్నోవర్ రూ.419 కోట్లుండగా.. 2013-14లో రూ.8,185 కోట్లకు చేరింది. ఇందులో దేశీ మార్కెట్ వాటా రూ.5 వేల కోట్లు కాగా.. మిగతాది అంతర్జాతీయ మార్కెట్‌ది. హవెల్స్ గ్రూప్ ఏటా 15% వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2020 కల్లా రూ.10 వేల కోట్లకు చేరుకుంటాం. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.400 కోట్ల వ్యాపారం జరిగింది. హైదరాబాద్, విజయవాడల్లో కార్యాలయాలున్నాయి.
 
జూలైకల్లా హావెల్స్ గీజర్లు...: మాది పూర్తిగా కుటుంబ వ్యాపారం. కంపెనీలో పీఈ పెట్టుబడులు, విదేశీ ఇన్వెస్టర్లు ఎవరూ లేరు. నిధుల సమీకరణ అవసరమూ లేదు. గత ఐదేళ్లలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెట్టాం. వచ్చే మూడేళ్లలో మరో రూ.600 కోట్ల పెట్టుబడులు పెడతాం. రూ.80 కోట్ల పెట్టుబడితో నిమ్రానాలో పెట్టిన గీజర్ల తయారీ యూనిట్‌ను త్వరలో ఆరంభిస్తాం. జూలై కల్లా గీజర్లను మార్కెట్లోకి తెస్తాం. ఈ ఏడాది చివరికి సబ్‌మెర్సిబుల్ పంపులనూ తెస్తాం. వచ్చే మూడేళ్లలో సోలార్ స్ట్రీట్ లైట్లు, ఎయిర్ కండీషనర్లు (ఏసీ) కూడా తీసుకొస్తాం.
 
వీటితోనే గట్టి పోటీ..
మాకు ధరలో చైనా ఉత్పత్తులతోను, నాణ్యతలో జర్మనీ, అమెరికా ఉత్పత్తులతోను పోటీ ఉంది. అయితే దేశీ వినియోగదారులిపుడు ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మేం టెక్నాలజీ వినియోగించి నాణ్యతతో రాజీపడకుండా ఉత్పత్తులు తెస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్, అల్యూమినియం ధరలు తగ్గుముఖం పడుతున్నా... దేశంలోని పన్నుల వల్లే విద్యుత్ ఉపకరణాల ధరలు తగ్గటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో యూరో ధరలు మారినప్పుడల్లా దిగుమతి సుంకం పెరుగుతుండటమూ ఒక కారణమే. మా టర్నోవర్‌లో 2 శాతాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద వెచ్చిస్తున్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు మా ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. 6 నెలల్లో మేమే సొంతంగా ఈ-కామర్స్‌లోకి వస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement