వీటిపై వ్యయం రూ.32,500 కోట్లకు ∙కంపెనీ వార్షిక నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఐటీసీ ఉత్పత్తులు దేశంలోని 25 కోట్లకు పైగా కుటుంబాలు వినియోగిస్తున్నాయి. తమ ఉత్పత్తులపై కస్టమర్ల వార్షిక వ్యయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.32,500 కోట్లకు చేరినట్టు ఐటీసీ ప్రకటించింది. కస్టమర్లు ఐటీసీ ఉత్పత్తుల కొనుగోలుకు వెచి్చంచే మొత్తం ఆధారంగా వార్షిక వ్యయాలను ఐటీసీ లెక్కిస్తుంటుంది. 25కు పైగా ప్రపంచస్థాయి భారత బ్రాండ్లు ఎఫ్‌ఎంసీజీలో భాగంగా ఉన్నాయని, ఇవన్నీ సొంతంగా అభివృద్ధి చేసినవేనని ఐటీసీ తన వార్షిక నివేదికలో తెలిపింది.
2022–23 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయం రూ.29,000 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 23 కోట్లకు ఐటీసీ ఉత్పత్తులు చేరువ కాగా, గత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కోట్ల కుటుంబాలకు చేరుకున్నట్టు సంస్థ తెలిపింది. ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ కింద బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, అగర్‌బత్తీలు, అగ్గిపెట్టెలు ఉన్నాయి.
గడిచిన కొన్నేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఐటీసీ తెలిపింది. బ్రాండెడ్ గోధుమ పిండిలో ఆశీర్వాద్ అగ్రస్థానంలో ఉందని.. స్నాక్స్‌లో బింగో, క్రీమ్ బిస్కెట్లలో సన్‌ఫీస్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించింది. అలాగే నోట్‌బుక్‌లలో క్లాస్‌మేట్, నూడుల్స్‌లో ఇప్పీ, బాడీవాష్‌లో ఫియామా, అగర్‌బత్తీల్లో మంగళ్‌దీప్ బ్రాండ్లు బలంగా ఉన్నట్టు తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావారణంలో, తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య కంపెనీ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ సగటు కంటే మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది.
వినియోగం పుంజుకుంటుంది..
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) అధిక వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని ఐటీసీ విశ్వాసం వ్యక్తం చేసింది. స్థిరమైన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పుంజుకోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కోలుకుంటున్నందున ఇవన్నీ సమీప కాలంలో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తాయని అంచనా వేసింది. సాధారణ వర్షపాతంతో రబీ సాగు మంచిగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది.
‘‘భౌతిక, డిజిటల్ వసతుల విస్తరణకు, తయారీ రంగం పోటీతత్వాన్ని ఇతోధికం చేసేందుకు, ప్రత్యక్ష/పరోక్ష, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార సులభతర నిర్వహణకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలు రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను బలంగా ముందుకు నడిపిస్తాయని ఐటీసీ తన నివేదికలో అంచనా వేసింది. ‘‘మూలధన వ్యయాల పెంపు, మౌలిక వసతులపై దృష్టి సారించడం దేశీయ తయారీని నడిపిస్తాయి. వ్యవసాయ సంబంధిత పథకాలు రైతులకు మేలు చేస్తాయి. తద్వారా గ్రామీణ వినియోగ డిమాండ్ పుంజుకుంటుంది. ఇది పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ఇతోధికం చేస్తుంది’’ అని అంచనా వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానత చర్యలు వ్యవసాయరంగ పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు కీలకమని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment