
ఫోర్బ్స్ టాప్–10లో హెచ్‌డీఎఫ్‌సీ
న్యూఢిల్లీ: గృహ రుణాల విభాగంలోని ‘హెచ్‌డీఎఫ్‌సీ’ తాజాగా ఫోర్బ్స్ టాప్–10 గ్లోబల్ కన్సూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకుంది. భారత్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే జాబితాలో స్థానం పొందటం గమనార్హం. 1.6 బిలియన్ డాలర్ల లాభం, 8.1 బిలియన్ డాలర్ల విక్రయాలతో ఇది 7వ స్థానంలో నిలిచింది. కన్సూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి సంబంధించి ఫోర్బ్స్ ప్రతి ఏడాది ఒక గ్లోబల్ జాబితాను రూపొందిస్తుంది.
తాజా జాబితాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీని తర్వాతి స్థానంలో వరుసగా క్యాపిటల్ వన్ ఫైనాన్షియల్ (2వ స్థానం), వీసా(3), ఓరిక్స్(4), సింక్రొనీ ఫైనాన్షియల్(5), డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్(6), మాస్టర్‌కార్డ్(8), పేపాల్(9), సీఐటీ గ్రూప్(10) ఉన్నాయి. కాగా హెచ్‌డీఎఫ్‌సీ గత మూడేళ్లుగా ప్రతి ఏడాది జాబితాలో నిలుస్తోంది. ఇక ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో భారత్ నుంచి 58 కంపెనీలు స్థానం పొందాయి.